మరోమారు అమెరికాలో తుపాకి గర్జించింది. దుండగుడు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వర్జీనియా రాష్ట్రంలోని బీచ్ నగరంలో జరిగిందీ ఘటన. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో ప్రభుత్వం భవన సముదాయంలోకి ప్రవేశించిన సాయుధుడు కాల్పులకు తెగబడ్డాడు.
ఈ కాల్పులలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన ఆరుగురిలో ఓ పోలీసు అధికారి కూడా ఉన్నాడు. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని హతమార్చారు. దుండగుడు అదే కార్యాలయంలో పనిచేసేవాడని పేర్కొన్న పోలీసులు.. కాల్పుల వెనకున్న కారణం తెలియాల్సి ఉందన్నారు.