భారత మహిళల క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం మొదలైంది. కోట్లాది క్రీడాభిమానుల కోరిక ఫలించిన వేళ వన్డే వరల్డ్ కప్ లో భారత జట్టు నయా చాంపియన్‌గా నిలిచింది.
ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో నెగ్గిన హర్మన్‌ప్రీత్ సేన మొట్టమొదటిసారిగా విశ్వ కప్ ను అందుకుంది.
ఓపెనర్ షఫాలీ వర్మ (78 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 87; 2/36), దీప్తి శర్మ (58 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 58; 5/39) ఆల్‌రౌండ్‌షోతో భారత్‌కు చిరస్మరణీయ విజయాన్నందించారు.
అటు దక్షిణాఫ్రికా కెప్టెన్ వోల్వార్ట్ (98 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌తో 101) శతక పోరాటానికి సహకారం కరువైంది.
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 298 పరుగులు చేసింది. మంధాన (58 బంతుల్లో 8 ఫోర్లతో 45) రాణించింది. ఖాకాకు మూడు వికెట్లు దక్కాయి.
ఛేదనలో దక్షిణాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. డెర్క్‌సెన్ (35) ఫర్వాలేదనిపించింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా షఫాలీ, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా దీప్తి శర్మ నిలిచారు.
అంతకుముందు మ్యాచ్ సమయానికి భారీ వర్షం కురవడంతో టాస్ కూడా వీలు పడలేదు. అనంతరం రెండు గంటలు ఆలస్యంగా సాయంత్రం 5 గంటలకు మ్యాచ్‌ను ఆరంభించారు.

