ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. తక్షణమే అమల్లోకి వస్తుందని రాజ్యసభలో ఘన్శ్యామ్ తివారీ ప్రకటన చేశారు.
ఉపరాష్ట్రపతి రాజీనామాపై హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు జగదీప్ ధన్ఖడ్ లేఖలో వివరించారు.
ధన్ఖడ్ రాజీనామా అనంతరం.. దానిని ఆమోదించినట్లు రాష్ట్రపతి కార్యాలయం మంగళవారం ప్రకటించింది. ఇదిలాఉంటే.. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామాపై ఎక్స్ వేదికగా స్పందించారు.
వివిధ హోదాల్లో ధన్ఖడ్ దేశానికి ఎనలేని సేవలు అందించారంటూ ప్రధాని మోదీ ఆయన్ను ప్రశంసించారు. జగదీప్ ధన్ఖడ్ ఆరోగ్యంగా ఉండాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.
“జగదీప్ ధంఖర్ కి భారత ఉపరాష్ట్రపతిగా సహా వివిధ హోదాల్లో మన దేశానికి సేవ చేయడానికి అనేక అవకాశాలు లభించాయి.
ఆయనకు మంచి ఆరోగ్యం చేకూరాలని కోరుకుంటున్నాను” అని ప్రధానమంత్రి మోదీ ఎక్స్ వేదికగా.. హిందీ, ఆంగ్ల భాషలలో పోస్ట్ చేసిన సందేశంలో పేర్కొన్నారు.