ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఎన్నిక ప్రక్రియ జరగనుంది. రాష్ట్ర పార్టీ కార్యాలయం అధ్యక్ష పదవి ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయగా.. ఓటింగ్ అర్హత కలిగినవారు 119 మంది ఉన్నట్లు తెలిపారు.
ఈ ఎన్నికలకు సంబంధించిన పరిశీలకులుగా కర్ణాటక ఎంపీ పీసీ మోహన్ వ్యవహరిస్తారని బీజేపీ తెలిపింది.
ఇవాళ నామినేషన్ పత్రాల స్వీకరణ, పరిశీలన ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేస్తారు. అయితే భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకు ఒకరే నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం ఉంది అంటున్నారు.
అయితే మంగళవారం అధ్యక్ష పదవి ఎన్నిక ఫలితాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. అధ్యక్షుడి ఎన్నికతో పాటు పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యుల కోసం కూడా ఈ ప్రక్రియ నిర్వహిస్తారు.
ఈ ఎన్నికకు సంబంధించిన ఓటర్ల జాబితాను విజయవాడలో ఉన్న రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో అందుబాటులో ఉంచారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ప్రముఖంగా ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే మాధవ్ పేరు ప్రముఖంగా తెరపైకి వచ్చింది.
అలాగే మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుల పేర్లు కూడా రేసులో ఉన్నాయంటున్నారు.
మరి అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. గతంలో కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజులు ఏపీ బీజేపీ అధ్యక్షులుగా పనిచేశారు.
2024 ఎన్నికలకు ముందు దగ్గుబాటి పురందేశ్వరి పార్టీ పగ్గాలను చేపట్టారు.. ఏపీలో కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసే పార్టీలతో కలిసి ఘన విజయం సాధించారు. పురందేశ్వరి రాజమహేంద్రవరం నుంచి ఎంపీగా విజయం సాధించారు.
అయితే ఆమెను అధ్యక్ష పదవిలో కొనసాగిస్తారనే టాక్ వినిపించింది.. కానీ అధిష్టానం మార్పు ఖాయమని సంకేతాలు ఇచ్చింది.
ఇటు తెలంగాణలో కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నికల జరగనుంది.
తుది రేసులో మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ల పేర్లు వినిపిస్తున్నాయి.
అక్కడ కూడా ఇవాళ నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది.. మంగళవారం కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటించనున్నారు.