హైదరాబాద్..ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం టీఆర్ ఎస్ తీవ్ర స్థాయిలో భారీ కసరత్తు చేసింది. నిన్న అర్థరాత్రి వరకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసిన ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఎట్టకేలకు ఐదుగురు పేర్లను సెలెక్ట్ చేశారు.
ఎమ్మెల్యే కోట, గవర్నర్ కోటలోని ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్ల ఎంపిక ఈసారి కొంచెం కష్టసాధ్యమైంది. ఆయా జిల్లాల్లో అధికార పార్టీలో ఆశావహులు అధికంగా ఉండటంతో కేసీఆర్ సుదీర్ఘ చర్చలు జరపాల్సి వచ్చింది. ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడ్డ ఆశావహులు తమలో ఎవరు పేర్లు ఉంటాయోనని కొంత మంది కంటి మీద కునుకులేకుండా ఎదురుచూశారు.
రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో అభ్యర్థుల ఎంపికపై టీఆర్ ఎస్ పార్టీ ఆచితూచి వ్యవహరించింది. అయితే అధికార పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపికయిన వారిలో వరంగల్‌కు చెందిన కడియం శ్రీహరి, మహబూబాబాద్ కుచెందిన తక్కళ్లపల్లి రవీందర్రావు, నల్గొండ జిల్లాకు చెందిన గుత్తా సుఖేందర్ రెడ్డి, కరీంనగర్‌కు చెందిన పాడి కౌశిక్‌రెడ్డి, సిద్దిపేటకు చెందిన మాజీ కలెక్టర్ వెంకట్రాంరెడ్డి ఉన్నారు.
వీరందరికి ప్రగతి భవన్ నుంచి పిలుపు రావడం, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేటితో నామినేషన్ల గడువు ముగియనుండడంతో వీరంతా ఇవాళ నామినేషన్ వేయనున్నారు.