telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

నడిచే చెట్టు..

ఆకాశాన్ని అనూహ్య
ఆశ్చర్యంగా చూడాలని
కిరణాల హిరణ్యాన్ని
చిగురాకుల దోసిళ్ళతో
చిరు దేహాన్నంతటా
పూత పూసుకోవాలని
గాఢంగా హత్తుకున్న
మెత్తటి మట్టి రేణువుల్ని
తప్పించుకొని గింజనుంచి
రెండురెమ్మలతో తలెత్తా –
సంబరంలో వినిపించే
ఆనందాల ఏదో గోలలా
అంబరాన రంగురంగుల
హరివిల్లు నాట్యహేలలా
చుట్టూ సందడే సందడి
మొక్కగా ఉన్నపుడు
తూనీగలు సీతాకోకలు
చెట్టయి కాస్త ఎత్తెదిగాక
కోయిల కూసే కూతలు
మామిడి పూసే పూతలు-
ఇన్ని రకాల జీవులలో
అతను ఒక అద్భుతం
నవ్వుతాడు కిలకిలలా
నడుస్తాడు చకచకలా
పాడుతాడు కోయిలలా
పరుగిడితే చిరుతనేలా
నాలానే అన్పిస్తాడతను
నిటారుగా నిలబడుతూ
తలపై ఆకుల్లా కురులు
చేతుల్లా రెండు శాఖలు –
నాగలి మోస్తూ అతనొస్తే
ఆకు రాల్చక చూస్తాను
గాలి ఆలింగనమౌతాను
అమ్మలా సాకాడు నన్ను
నేను తనలా నడవలేను
తనుమాత్రం నడిచేచెట్టు
* * *
రైతు మట్టిలో మట్టికై పుట్టి
మట్టి కొరకై మట్టిలోనే గిట్టి –
మట్టిబంధాన్ని పట్టివదలని
అతను నాకందుకే బంధువు
గింజ పండించేవాడి ఋణం
తీర్చాలనుకునే పుడుతుంది
నీటి బిందువుకు ఓ మొలక
దాహం తీర్చాలనే ఉంటుంది –
నది ఏ సేద్యాన్నీ చేరలేనపుడు
రైతుపాదాన్ని మడి తాకనపుడు
హలాన్ని కాదనుకుంటున్న దేశం
తెలిసీ ఒక అపరాధం చేస్తుంది

Related posts