రంగస్థల నటుడు, సినిమా నటుడు, జర్నలిస్ట్ రావి కొండలరావు మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. ఆయన శ్రీమతి రాధాకుమారి కొన్ని సంవత్సరాల క్రితం మరణించారు. అప్పటి నుంచి రావి కొండలరావు ఒంటిరిగానే జీవితం గడుపుతున్నారు.
11 ఫిబ్రవరి 1932న శ్రీకాకుళంలో జన్మించిన రావి కొండలరావు చదువుకుంటూనే అనేక నాటకాల్లో నటించారు. ఆ తరువాత మద్రాసు నగరానికి వచ్చిన రావి కొండలరావు చందమామ, విజయ్ చిత్ర పత్రికల్లో జర్నలిస్టుగా పని చేస్తూనే సినిమాల్లో నటించడం ప్రారంభించారు. ఇప్పటి వరకు ఆయన 600 సినిమాల్లో విభిన్నమైన పాత్రలను పోషించారు.
రావి కొండలరావు నటించిన చిత్రాల్లో రాముడు భీముడు, తేనె మనసులు, ప్రేమించు చూడు, ఆలీబాబా 40 దొంగలు, అందాల రాముడు, దసరా బుల్లోడు, జీవితచక్రం, రంగూన్ రౌడీ, చంటబ్బాయ్, దొంగకోళ్ళు, పెళ్ళి పుస్తకం, బృందావనం, మేడం, భైరవ ద్వీపం, రాధా గోపాలం, కింగ్, వరుడు మొదలైన చిత్రాల్లో విభిన్న పాత్రలను పోషించారు. చక్కటి నటనకు, సునిశితమైన హాస్యానికి రవి కొండలరావు పేరు సంపాదించారు. ఆయన తెలుగు సినిమా రంగం మీద, జర్నలిజం మీద అనేక పుస్తకాలు రచించారు. అందులో బ్లాక్ అండ్ వైట్ ప్రసిద్ధమైనది.
అటు జర్నలిజంలోనూ, ఇటు సినిమా రంగంలోనూ అపారమైన అనుభవం ఉన్న రావి కొండలరావు మరణించడం ఎంతో లోటు అని సినిమా ప్రముఖులు పేర్కొన్నారు. రావి కొండలరావు మృతికి తెలుగు సినిమా రంగంలోని ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
– విమలత
‘సీటీమార్’ విజయంపై ప్రభాస్ కామెంట్స్