సింగపూర్ పర్యటనలో భాగంగా ఎయిర్‌బస్ ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ ఆనంద్ స్టాన్లీతో లోకేష్ కీలక సమావేశం నిర్వహించారు.
ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్‌ను విమానయాన రంగంలో ఒక ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే అద్భుత అవకాశాలపై లోతైన చర్చ జరిగింది.
లోకేష్ మాట్లాడుతూ, భారతదేశంలో విమానాల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని, పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, ఆగ్నేయాసియా మార్కెట్ల నుండి విమాన సేవలకు డిమాండ్ పెరుగుతోందని వివరించారు.
ఈ పెరుగుదల మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ (MRO) సేవలకు భారీ మార్కెట్‌ను సృష్టిస్తుందని చెప్పారు. ప్రస్తుతం భారతదేశంలో 850కి పైగా ఎయిర్‌బస్ విమానాలు సేవలందిస్తున్నాయని, ప్రపంచంలోనే ఎయిర్‌బస్‌కు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సింగిల్-కంట్రీ మార్కెట్‌గా భారత్ నిలిచిందని లోకేష్ తెలిపారు.
రాబోయే 20 ఏళ్లలో భారతదేశానికి 1,750 కొత్త విమానాలు అవసరమని అంచనా వేయబడిందని, ఇందులో A320 ఫ్యామిలీ విభాగాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు.
భారత వాణిజ్య విమానాల్లో దాదాపు 65-70% వరకు ఎయిర్‌బస్ విమానాలే ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు.
ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ, ఆంధ్రప్రదేశ్ దక్షిణాసియాలో ఎయిర్‌బస్‌కు డెడికేటెడ్ MRO హబ్‌గా మారే సత్తా ఉందని లోకేష్ స్టాన్లీకి వివరించారు.
విమానయాన భాగస్వాములకు అత్యుత్తమ సర్వీసింగ్ సేవల కోసం ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పని చేయాల్సిందిగా ఆయన ఎయిర్‌బస్‌ను కోరారు.
“MRO ఎకోసిస్టం వ్యవస్థను నిర్మించడానికి, సింగపూర్ ప్రమాణాలకు అనుగుణంగా ప్రపంచ స్థాయి సౌకర్యాలను కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం” అని లోకేష్ హామీ ఇచ్చారు.
తాము ప్రతిపాదిస్తున్న MRO హబ్ భారతీయ విమానయాన సంస్థలకు సమయం, ఖర్చులను తగ్గించడమే కాకుండా, విమాన లభ్యతను మెరుగుపరుస్తుందని ఆయన వివరించారు.
దీనివల్ల ఆంధ్రప్రదేశ్ పొరుగు దేశాల విమాన సేవలకు ప్రాంతీయ MRO హబ్‌గా అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తమ రాష్ట్రంలో ఉన్న అత్యాధునిక సౌకర్యాలను స్వయంగా చూసేందుకు ఆంధ్రప్రదేశ్‌ను సందర్శించాల్సిందిగా లోకేష్ ఆనంద్ స్టాన్లీని ఆహ్వానించారు.
ప్రపంచ విమానయాన దిగ్గజం ఎయిర్‌బస్:
ఫ్రాన్స్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన ఎయిర్‌బస్, ప్రపంచంలోనే అతిపెద్ద విమాన తయారీ సంస్థ. వాణిజ్య విమానాల నుండి రక్షణ, అంతరిక్ష వాహనాల వరకు ఎన్నోంటిని ఉత్పత్తి చేస్తుంది. యూరప్, ఆసియా, అమెరికా ఖండాలలో దీనికి విస్తృత మార్కెట్ ఉంది.
ఆసియా పసిఫిక్ ప్రాంతానికి సింగపూర్ ఎయిర్‌బస్‌కు కీలక కేంద్రం కాగా, మనదేశం దీనికి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటి.
భారత వాణిజ్య విమాన మార్కెట్‌లో గణనీయమైన వాటాతో పాటు, బెంగళూరులో ఇంజనీరింగ్ కేంద్రం, ఢిల్లీలో శిక్షణా కేంద్రం, అనేక భాగస్వామ్యాలు ఉన్నాయి.
పెరుగుతున్న భారతీయ విమాన ప్రయాణ డిమాండ్‌ను తీర్చడానికి ఎయిర్‌బస్ తన పెట్టుబడులను నిరంతరం పెంచుకుంటోంది.
ఈ భేటీ ఆంధ్రప్రదేశ్ మరియు ఎయిర్‌బస్ మధ్య భవిష్యత్ సహకారానికి బలమైన పునాది వేస్తుందని ఆశిద్దాం.