కొవిడ్-19(కరోనా) వైరస్ కారణంగా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 2 లక్షల మంది అస్వస్థతకు గురికాగా… దాదాపు 8 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. సాధారణంగా వచ్చే జలుబు నుంచి మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (మెర్స్-సీవోవీ), సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్-సీవోవీ) వంటి తీవ్రమైన వ్యాధుల వరకు కారణమయ్యే ఓ పెద్ద వైరస్‌ల జాతి కుటుంబమే ఈ కరోనా వైరస్‌లు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెబుతోంది. అయితే కొవిడ్-19(కరోనా) వైరస్ కణాలు గాల్లో గంటలపాటు, వస్తువులపై(ఉపరితలాలు) రోజుల పాటు ఉంటాయని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది. యూఎస్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్‌ఫెక్షస్ డిసీజెస్(ఎన్ఐఏఐడీ) శాస్త్రవేత్తలు కరోనా బాధితుల నుంచి(దగ్గు, ముట్టుకోవడం ద్వారా) వైరస్ ఏ విధంగా ఇతరులకు వ్యాపిస్తుందో తెలుసుకునేందుకు ప్రయోగం చేశారు. ఈ ప్రయోగంలో ఓ డివైజ్ ద్వారా ఏరోసోల్(గాలితుంపర)ను డిస్పెన్స్ చేసి దీని ద్వారా దగ్గు, తుమ్ముల నుంచి విడుదలయ్యే మైక్రోస్కోపిక్ డ్రాప్‌లెట్స్(సూక్ష్మ కణాలు)ను డూప్లికేట్ చేశారు. అనంతరం ఎస్ఏఆర్ఎస్-సీఓవీ-2 ఎంత సమయం వరకు వ్యాపింపచేసే విధంగా ఉంటుందో తెలుసుకున్నారు. ఈ ప్రయోగంలో.. వైరస్ కణాలు గాల్లో కనీసం మూడు గంటలు ఉంటాయని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ప్లాస్టిక్, స్టెయిన్‌లెస్ స్టీల్‌పై వైరస్ మూడు రోజుల తరువాత కూడా ప్రత్యక్షంగానే ఉన్నట్టు తెలుసుకున్నారు. ఇక రాగిపై నాలుగు గంటల తరువాత వైరస్ పోతోందని నిర్థారించారు. 66 నిమిషాల తర్వాత గాల్లో వైరస్ పనితీరు సగం తగ్గినట్టు ప్రయోగంలో తేలింది. మరో 66 నిమిషాల తర్వాత 75 శాతం వైరస్ కణాలు కనుమరుగవుతున్నాయని.. 25 శాతం కణాలు మాత్రం జీవించే ఉంటున్నాయని అన్నారు. ఇక మూడు గంటల తర్వాత ఈ కణాలు 12.5 శాతానికి పడిపోతున్నాయని రీసెర్చ్‌ను లీడ్ చేస్తున్న నీల్టీ వాన్ డారెమాలెన్ తెలిపారు. స్టెయిన్ లెస్ స్టీల్‌పై 5 గంటల 38 నిమిషాల తర్వాత, ప్లాస్టిక్‌పై 6 గంటల 49 నిమిషాల తర్వాత, కార్డ్‌బోర్డ్‌పై మూడున్నర గంటల తర్వాత సగం వైరస్ కణాలు కనుమరుగవుతున్నాయని ప్రయోగంలో తేలిందన్నారు. అయితే ఈ ఫలితాల్లో కొన్ని తేడాలు ఉండటంతో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ఫలితాలను విశ్లేషించాలని సూచించారు. అన్ని వస్తువుల కంటే రాగిపై అతి తక్కువగా.. 46 నిమిషాల్లోనే సగం వైరస్ కణాలు మాయమవుతున్నట్టు శాస్త్రవేత్తలు చెప్పారు. ప్రయోగంలో భాగంగా ఎస్ఏఆర్ఎస్-సీఓవీ-2 స్థిరత్వాన్ని ఎస్ఏఆర్ఎస్-సీఓవీ-1 స్థిరత్వంతో పోల్చి చూశామని.. రెండూ ఒకేరకమైన ఫలితాలను ఇచ్చాయన్నారు. దీనిబట్టి.. రోగలక్షణాలు కనిపించని వ్యక్తులు వైరస్‌ను వ్యాప్తి చేయడం, రోగుల ఎగువ శ్వాసకోశంలో వైరస్ కణాలు అధికంగా ఉండటం వంటి ఇతర కారణాలు ఈ రెండు వైరస్‌ల మధ్య వ్యత్యాసానికి దారితీసి ఉండొచ్చని భావిస్తున్నారు.
previous post
సినీ పరిశ్రమ కోసం మేము కూడా ఏపీ సీఎంను కలుస్తాం..