నాయకుడంటే ప్రజల తలరాతలు మార్చే చంద్రబాబులా ఉండాలి కానీ తలకాయలు తీసేలా ఉండకూడదని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
ఈ రోజు తిరుపతి నియోజకవర్గంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు.
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై మంత్రి నిమ్మల మండిపడ్డారు. తలకాయలు అయినా, మామిడి కాయలు అయినా తొక్కించుకుంటూ పోతున్నాడని ఆరోపించారు.
ప్రజల తలకాయలు తీసే నేత జగన్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో మళ్లీ జగన్ అధికారంలోకి రాడనే భరోసా ఇవ్వాలని పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారని చెప్పారు.
పారిశ్రామికవేత్తలను జగన్ అంతలా భయపెట్టాడని ఆరోపించారు.
స్వల్పకాలంలోనే మంచి ప్రభుత్వమని పేరు..
అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ కూటమి ప్రభుత్వం చేపట్టిన పథకాలతో స్వల్ప కాలంలోనే మంచి ప్రభుత్వమనే పేరు తెచ్చుకున్నామని మంత్రి నిమ్మల పేర్కొన్నారు.
తొలి ఏడాదిలోనే 16 వేలకు పైగా టీచర్ పోస్టుల భర్తీ, అన్న క్యాంటీన్లతో రోజుకు 2.5 లక్షల మందికి భోజనం వంటి పథకాలను అమలు చేస్తున్నామని గుర్తు చేశారు.
రాయలసీమలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు చూసినా గుర్తొచ్చేది ఎన్టీఆర్, చంద్రబాబులేనని చెప్పారు. వైసీపీ నేతలు తమ కక్షలు తీర్చుకోవడానికి, ప్రజలను వేధించడానికే మళ్లీ అధికారంలోకి రావాలని ఆశపడుతున్నారని మంత్రి నిమ్మల ఆరోపించారు.
మండలిలో ఉన్నవారంతా చంద్రబాబు భజనపరులే: రోజా