తెలుగు వారికి అతి పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇళ్లకు తాళాలు వేసి ఎక్కువ రోజులు బయటికెళ్లే వారికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు.
సొంతూళ్లకు వెళ్లే ముందు ఇంటి యజమానులు తప్పనిసరిగా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో నగర వాసులను అలర్ట్ చేశారు వీసీ సజ్జనార్.
ప్రయాణానికి ముందే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో గానీ, బీట్ ఆఫీసర్‌కు గానీ సమాచారం అందిస్తే పెట్రోలింగ్‌లో భాగంగా సిబ్బంది ఆయా ఇళ్లపై ప్రత్యేక నిఘా ఉంచుతారని ఆయన పేర్కొన్నారు.
ఇలా చేయడం ద్వారా దొంగలపై ఓ కన్ను వేయొచ్చు. సమాచారం ఇచ్చిన ఇంటి వద్ద అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే పోలీసులు ఆలోచించకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
సొంతూళ్లకు వెళ్లేవారు ఇళ్లలో నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులను ఉంచకూదని సీపీ సజ్జనార్ చెప్పారు. అలాంటి విలువైన వస్తువులును బ్యాంకు లాకర్లలో లేదా ఇతర సురక్షిత ప్రాంతాల్లో భద్రపరుచుకోవాలి సూచించారు.
ఈ సందర్భంగా పోలీసులు చేస్తున్న కృషిని కూడా సజ్జనార్ వివరించారు. ఆధునిక పోలీసింగ్ అంటే కేవలం నేరాలు జరిగిన తర్వాత స్పందించడం మాత్రమే కాదని అవి జరగకుండా ముందుగానే నివారించడం కూడా అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
పండుగ సీజన్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు, మీ ఇళ్ల భద్రతకు పోలీస్ శాఖ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే దాని కోసం ప్రజల సహకారం చాలా అవసరమని చెప్పారు.
అత్యవసర సమయంలో వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలని సీపీ సజ్జనార్ నగర ప్రజలకు సూచించారు.

