telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

అమ్మవారి హారతులలో .. ప్రత్యేకతలు తెలుసా..

speciality of navatratri haratulu

శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా దుర్గమ్మ వివిధ అలంకారాల్లో దర్శనమిస్తుంది. అటువంటి అమ్మవారికి ఇచ్చే హారతి ఎంతో ముఖ్యమైనది. ఒకదాని తర్వాత మరొకటి వచ్చే పంచ హారతులను చూసేందుకు రెండు కళ్లూ సరిపోవు. ప్రధానంగా సాధారణ రోజుల్లో హారతులను చూడాలంటే విజయవాడ దుర్గగుడి అధికారులు భక్తుల నుంచి రెండు వందల రూపాయలు వసూలు చేస్తుంటారు. కానీ దసరా ఉత్సవాల్లో మాత్రం భక్తులను టిక్కెట్ లేకుండా అనుమతిస్తూ.. ఆ అపురూప హారతిని దర్శించుకునే వీలు కల్పిస్తున్నారు ఆలయ అధికారులు. సాయం సంధ్యవేళ నివేదన అనంతరం దుర్గమ్మకు పంచ హారతులు ఇస్తుంటారు. అందులో మొదటగా ఇచ్చేది ఓంకార హారతి. సృష్టికి మూలమైన ఓంకార నాదాన్ని వినడం.. ఓంకార రూపాన్ని చూడడం వల్ల పాపాలు తొలగిపోతాయని, శుభాలు కలుగుతాయని నమ్మకం. ఓంకార హారతిని దర్శించడం వలన భక్తులకు మోక్షఫలం లభిస్తుందని ప్రతీతి. అమ్మవారికి ఇచ్చే మరో హారతి నాగహారతి . దేవతా స్వరూపమైన నాగ సర్పం దీర్ఘాయువుకు, పవిత్రతకు ప్రతీక. నాగహారతిని దర్శించడం వలన భక్తులకు సంతాన సౌభాగ్యము, రోగ నివారణ కలుగుతుందని.. సర్ప దోషాలు తొలగిపోతాయని విశ్వాసం.

మహిమాన్వితమైన మరో హారతి పంచ హారతి.. సద్యోజాత, వామ దేవ, అఘోర, తత్పరుష, ఈశాన అనే నామములతో ఉన్న పరమేశ్వరుని పంచముఖాలకు ప్రతి రూపం పంచ హారతి. ఈ హారతి దర్శనం వలన భక్తులకు పంచ మహాపాతకాలు నశిస్తాయని.. పంచ ప్రాణాలకు స్వాంతన కలుగుతుందని.. మల్లేశ్వరస్వామి వారి పరిపూర్ణ కటాక్షం లభిస్తుందని నమ్మకం. నాలుగో హారతి… కుంభ హారతి. సమాజానికి రక్షణ కలిగించేది కుంభహారతి. ఈ హారతిని దర్శించడం వలన భక్తులకు అనన్యమైన పుణ్యం, పంచ భూతాత్మకమైన జీవరక్ష లభిస్తుందని విశ్వాసం. చివరిగా ఇచ్చే మరో హారతి సింహ హారతి. శత్రువులను శిక్షించి, ధర్మాన్ని రక్షించే తత్వానికి, ధైర్యానికి సింహ రూపం నిదర్శనం. సింహం అమ్మవారి వాహనం. సింహహారతి దర్శనం వలన భక్తులకు విజయము, దుర్గమ్మ అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. అమ్మవారికిచ్చే పంచ హారతులను వీక్షించే భక్తులు తన్మయం చెందుతున్నారు.

Related posts