రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు విచారం వ్యక్తం చేశారు.
తక్షణం ఘటనా స్థలానికి చేరుకొని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని చెప్పారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో క్షతగాత్రులను వెంటనే హైదరాబాద్కు తరలించి మెరుగైన వైద్య చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఆదేశించారు.
అందుబాటులో ఉన్న మంత్రులు వెంటనే ప్రమాద సంఘటనకు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించాలని చెప్పారు.
సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను, ఆర్టీసీ ఎండీ, రవాణా కమిషనర్, ఫైర్ డీజీలను అదేశించారు.
ప్రమాదంలో గాయపడిన వారికి అత్యవసర వైద్య సేవలు అందించేందుకు గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి గారు అధికారులను అదేశించారు.
పరిస్థితి విషమంగా ఉన్న వారందరిని కాపాడేందుకు వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలని.. హెల్త్ ఎమర్జెన్సీ తరహాలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర సచివాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు.
ప్రమాదానికి సంబంధించి సమాచారం, క్షతగాత్రులు, బంధుమిత్రులు, ఇతర కుటుంబ సభ్యుల కోసం కంట్రోల్ రూమ్ లో 9912919545, 9440854433 నంబర్లను ఏర్పాటు చేశారు.

