తాను అన్నలా భావించిన ఆజంఖాన్ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయని బీజేపీ అభ్యర్థి, ప్రముఖ సినీనటి జయప్రద అన్నారు. ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆమె ఆజంఖాన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఓ వార్తా సంస్థతో ఆమె మాట్లాడుతూ.. తాను ఖాకీ లోదుస్తులు వేసుకున్నానంటూ ఆజంఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పటికీ ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు.
ఆజంఖాన్‌ను ఇన్నాళ్లు తన సోదరుడిగా భావించినందుకు సిగ్గుపడుతున్నట్టు చెప్పారు. తన సోదరుడిగా ఆయన సరిపోనని ఖాన్ తనకు తానే నిరూపించుకున్నారని జయప్రద అన్నారు. ఆజంఖాన్ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నప్పటికీ ఎన్నికల్లో ఆయన విజయం సాధిస్తున్నారంటే అందుకు కారణం ప్రజలు ఆయనను చూసి భయపడుతున్నారని చెప్పారు.
ఖాన్ పూర్తిగా అభద్రతా భావంలో ఉన్నారని, మహిళలు పురోగతి సాధించడం ఆయనకు ఇష్టం ఉండదన్నారు. ఖాన్ తనపై చేసిన వ్యాఖ్యల వ్యవహారం చాలా చిన్నదని అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ చెప్పడం ఇంకా దారుణమన్నారు. ఖాన్ వ్యాఖ్యలపై దేశమంతా స్పందించిందన్నారు. ప్రజల మద్దతు తనకే ఉందని జయప్రద ఆశాభావం వ్యక్తం చేశారు.


టీఆర్ఎస్ అవినీతిపై బీజేపీ మాట్లాడటం సంతోషకరం: జీవన్ రెడ్డి