ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో గురువారం నుంచి నెల రోజులపాటు వారాహి ఉత్సవాలు నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా అమ్మవారికి ఈవో శీనానాయక్ దంపతులు తొలి సారెను సమర్పించారు.
మేలతాళాలతో మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి సారే సమర్పించారు. పసుపు కుంకుమ, పువ్వులు, గాజులు, చలిమిడి, గోరింటాకు అమ్మవారికి శేష వస్త్రాలను సమర్పించారు.
ఈ సందర్బంగా ఈవో శీనానాయక్ మీడియాతో మాట్లాడారు.. తమ చేతుల మీదుగా అమ్మవారికి సారె సమర్పించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ఆషాఢ మాసంలో అమ్మవారిని తమ పుట్టింటికి రమ్మని వేడుకుంటూ సారె సమర్పించామన్నారు. ఆషాఢ మాసం నెల రోజులపాటు అంగరంగ వైభవంగా సారే సమర్పణ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు.
తెలంగాణ నుంచి అమ్మవారికి ఈనెల 29వ తేదీన బంగారు బొనాం సమర్పిస్తారని చెప్పారు. ఈ ఆషాఢ మాసంలోనే అమ్మవారికి శాఖాంబరి ఉత్సవాలు జరుగుతాయన్నారు.
జులై 8 ,9, 10 తేదీలలో శాకంబరీ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఈరోజు నుంచి నెల రోజులపాటు ఇంద్రకీలాద్రిపై వారాహి ఉత్సవాలు జరుగుతాయని ఈవో శీనానాయక్ వెల్లడించారు.
కాగా ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని.. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు భక్తులు సారెను సమర్పించడం ఆనవాయితీ.
తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటకల నుంచి కూడా దుర్గమ్మకు భక్తులు సారె సమర్పిస్తారు. మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవమూర్తిని ప్రతిష్టించి పూజలు చేస్తారు.
మూలవిరాట్ దర్శన అనంతరం ఉత్సవమూర్తికి సారెను సమర్పిస్తారు. వైదిక కమిటీ సూచనల మేరకు హోమ గుండాలు, భక్తులు కూర్చునేందుకు తివాచీలు ఏర్పాటు తదితర అంశాలపై ఈవో శీనా నాయక్ అధికారులకు పలు సూచనలు చేశారు.
వారాహి అమ్మవారి నవరాత్రుల గురించి ప్రచారం చేసి విజయవంతం చేయాలని పలు విభాగాలకు ఆదేశాలు ఇచ్చారు. వారాహి ఉత్సవాలు గురువారం (26వ తేదీ) నుంచి జూలై 24వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి.