telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అప్పుడు టి వి  నందుల ఎంపిక ఎలావుండేదంటే ..?

bhageeradha as member of nandi committee
27 సంవత్సరాల క్రితం ఇదే రోజు జరిగిన సంగతి. హైదరాబాద్ లో జ్యోతి చిత్ర రిపోర్టర్ గా పనిచేస్తున్న రోజులు. అప్పుడు సమాచార శాఖా  కమీషనర్ గా మురళి కృష్ణ గారు పనిచేసేవారు. అప్పుడు సినిమా కు సంబందించిన విషయాలు కూడా సంచార శాఖ చూసేది. మురళి కృష్ణ గారిని నేను తరచూ కలుస్తూ ఉండేవాడిని. జనవరిలో అనుకుంటాను మురళీ కృష్ణ గారి నుంచి ఫోన్ వచ్చింది. “1991 సంవత్సరానికి టి.వి  నంది అవార్డుల కమిటీ  వేశాము. ఉత్తర్వు కూడా వచ్చింది. అయితే మీరు కూడా ఆ కమిటీలో ఉంటే బాగుంటుంది ” అన్నారు. “ఉత్తర్వు లు కూడా వచ్చాక నన్ను ఎలా వేస్తారు “? అని అడిగాను. “కమిటీలో  కో ఆప్ట్  చేస్తాను … మీరు కమిటీలో పనిచేస్తారా ? మీ అంగీకారం కోసం ఫోన్ చేశాను ” అన్నారు. నంది అవార్డుల కమిటీ అంటే .. బాగా పేరున్న వారినే నియమిస్తారు … మురళి కృష్ణ గారు నా మీద అభిమానంతో అడిగారు. 
నిజానికి నంది అవార్డుల కమిటీలో ఉండటం అంటే  మాటలు కాదు. అందుకే “సరే మురళీకృష్ణ గారు ” అని చెప్పాను. “థాంక్ యు భగీరథ గారు … మీకు రేపటికల్లా లెటర్ పంపిస్తాను “అన్నారు. “మురళి కృష్ణగారు మీకే థాంక్స్,  నామీద నమ్మకంతో కమిటీలో వేశారు. మీ నమ్మకాన్ని నిలబెడతాను ” అన్నాను. “నా కా నమ్మకం  వుంది .. అందుకే మిమ్మలిని ప్రత్యేకించి ఎంపిక చేశాను” అన్నారు. ఆ కమిటీకి చైర్మన్ జస్టిస్ రామానుజుల నాయుడు గారు. కమిటీలో తుర్లపాటి కుటుంబరావు గారు, కొలకలూరి ఇనాక్ గారు, డాక్టర్ పి.యశోదా రెడ్డి, దూరదర్శన్  డైరెక్టర్ అప్పారావు గారు మొదలైన హేమా హెమీలున్నారు. మురళి కృష్ణ గారు కన్వీనర్. 
విశేషమేమంటే నేను పనిచేసే జ్యోతి చిత్ర సినిమా వార పత్రిక ఎడిటర్ తుర్లపాటి కుటుంబరావు గారు, అదే పత్రికలో రిపోర్టర్ గా పనిచేసే  నేను కూడా ఆ కమిటీలో ఉండటం నిజంగా అదృష్టమే. అది కూడా కమిటీలో ప్రత్యేకించి  నన్ను చేర్చడం ఇంకా  ఆనందం. దూరదర్శన్ ప్రసారమైన సీరియల్స్, డాక్యూమెంటిరీలు  మొదలైన వాటిని చూసి ఉత్తమమైన వాటిని నిర్ణయించాము. అప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేదురుమల్లి జనార్దన్  రెడ్డి గారు పదవిలో వున్నారు. 1992 మార్చి 27 న ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారిని సచివాలయంలో కలసి కమిటీ  రిపోర్ట్ ఇచ్చాము.
ఆ తరువాత మురళి కృష్ణ గారు “కమిటీలో మీరు ఉండటం చాలా మేలైంది .. నా నమ్మకాన్ని నిలబెట్టారు” అన్నారు. అప్పుడు మంజులా నాయుడు గారి సీరియల్, దేవదాసు కనకాల సీరియల్  పోటీ పడ్డాయి. రెండింటి విషయమై వాదోపవాదాలు జరిగాయి. ఎక్కువ మంది ఒక సీరియల్ మొదటి బహుమతి క్రింద ఎంపిక చేద్దామని అన్నారు. అయితే నేను వారి అభిప్రాయంతో ఏకీభవించలేదు. ఆ సీరియల్ ను ఎందుకు ఎంపిక చేయకూడదో  వివరించాను. రెండవ బహుమతి అనుకున్న దాన్ని  ప్రధమ  బహుమతి గా పరిగణించాలని చెప్పాను. నువ్వు కుర్రోడివి కూర్చో అన్నారు. కానీ నేను వారి వాదం తప్పని … ప్రభుత్వ అవార్డుల కోసం ఎంపిక చేసేటప్పుడు నియమ నిబంధనలు పాటించాలని అన్నాను. సీరియల్ గ్రాండ్ గా తీయడం ముఖ్యం కాదని అదునులో సామాజిక స్పృహ ఉందా ? సమాజానికి ఏదైనా సందేశం ఉందా ? అనే కోణంలో  చూడాలని చెప్పాను. 
చివరికి  నా వాదనతో  కమిటీ ఏకీభవించి దేవదాసు కనకాల సీరియల్ ను ఉత్తమమైనదిగా నిర్ణయించారు. బహుశా ఈ విషయం తెలిసి మురళి కృష్ణగారు  నన్ను కంగ్రాట్యులేట్ చేసి వుంటారు. నిజంగా మొదటిసారి పెద్దవారితో కలసి నంది అవార్డుల కమిటీలో ఉండటం  కమిటీలో నా వాదన బలంగా వినిపించి నేను చెప్పిన సీరియల్ ను ఎంపిక చేయడం మర్చిపోలేని అనుభవం. ఈ ఫొటోలో చైర్మన్ రామానుజుల నాయుడు గారు, తుర్లపాటి కుటుంబ రావు గారు, కొలకలూరి ఇనాక్ గారు, మురళీ కృష్ణ గారు నేను వున్నాము. 
-భగీరథ 

Related posts