telugu navyamedia
International

షేక్ హసీనా లీక్ ఆడియో కలకలం: నిరసనకారులపై కాల్పులకు ఆదేశాల వీడియో బయటకు

బంగ్లాదేశ్‌లో గత ఏడాది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసనకారులు ఉద్యమించిన సమయంలో వారిపై కాల్పులు జరపమంటూ అప్పటి ప్రధానిగా ఉన్న షేక్ హసీనా  పోలీసులకు జారీ చేసిన ఆదేశాల ఆడియో ఒకటి తాజాగా లీక్ అయింది.

బీబీసీకి చెందిన పత్రాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్టు మీడియా కథనాలు వెలువడుతున్నాయి. నాటి బంగ్లా అల్లర్లలో 1,400 మంది ప్రాణాలు కోల్పోయారు.

లీకైన ఆడియో వివరాల ప్రకారం, నిరసనకారుల కట్టడికి మారణాయుధాలను వినియోగించాలని హసీనా ఒక సీనియర్ పోలీసు అధికారికి ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది.

‘ఎక్కడ అవసరమైతే అక్కడ ఆయుధాలు వాడండి. వారెక్కడ కనిపించినా కాల్చేయండి’ అని హసీనా ఆదేశాలిచ్చినట్టు సమాచారం.

హసీనా తన అధికారిక నివాసం గణభబన్ నుంచి 2024 జూలై 18 సాయంత్రం ఫోనులో ఈ ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది.

దీంతో గంటల వ్యవధిలోనే ఢాకా అంతటా పోలీసు బలగాలను మోహరించారు. మిలట్రీ గ్రేడ్ రైఫిల్స్‌ను ఉపయోగించి కాల్పులు జరిపారు.

ఐదు యూనివర్శిటీ జోన్లు, సమీప జిల్లాల్లో ఈ మారణాయుధాలు ఉపయోగించారు.

పబ్లిక్ సెక్టార్‌లోని ఉద్యోగాల్లో కోటా సిస్టంను ప్రభుత్వం విస్తరించడంతో బంగ్లాలో తీవ్ర వ్యతిరేకత తలెత్తింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అల్లర్లు చోటుచేసుకోవడంతో హసీనా ప్రభుత్వం కుప్పకూలింది.

పదవీచ్యుతురాలైన హసీనా దేశం వదలి భారత్‌లోని అజ్ఞాత ప్రాంతంలో ఉంటున్నారు.

బంగ్లాలో అల్లర్లు, వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన కేసులో హసీనాను వెనక్కి రప్పించేందుకు మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

కోర్టు ధిక్కారణ కేసులో షేక్ హసీనాకు ఇంటర్నేషన్ ట్రిబ్యునల్ ఇటీవల ఆరు నెలల జైలుశిక్ష విధించింది.

Related posts