telugu navyamedia
ఆంధ్ర వార్తలు

కర్మ సిద్ధాంతం చాలా గొప్పది ..అనుభవించాల్సిందే ..

కాంగ్రెస్ రాహుల్ గాంధీని ఈడీ విచారణ పై రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఘాటు విమర్శలు చేశారు. బుధవారం ఉదయం రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుతో  విజయసాయి రెడ్డి భేటీ అయ్యారు.. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. కర్మ సిద్ధాంతం చాలా గొప్పది. దీని ప్రకారం పుణ్యం చేస్తే పుణ్య ఫలాలు, పాపం చేస్తే పాప ఫలాలు ఈ జీవితంలోనే గానీ వ‌చ్చే జీవితంలో గానీ అనుభవించక తప్పదని , దాన్ని నేను గ‌ట్టిగా న‌మ్మ‌తాన‌ని వ్యాఖ్య‌లు చేశారు.

సోనియా, రాహుల్‌లపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి కక్ష సాధింపులకు పాల్పడటం లేదని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపైనే విచారణ జరుగుతుందన్నారు. ఈడీ విచారణకు రాజకీయాలను ఆపాదించడం తగదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

ఈడీని స్వచ్ఛందంగా తమ పని చేసుకునేలా విపక్షాలు సహకరించాలని కోరారు. మనీలాండరింగ్ జరిగిందంటున్నారని, దానిపై విచారించడం తప్పా? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వానికి దీనికి సంబంధం లేదన్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకు విచారణ జరుగుతుందన్నారు.

మరోవైపు మమత నిర్వహించిన‌ సమావేశానికి సంబంధించి తమకు ఎలాంటి ఆహ్వానం లేదన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే ఏ అభ్యర్థికి మద్దతివ్వాలనే విషయంలో జగన్ నిర్ణయం తీసుకుంటారని విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రతిపక్షం తమ అభ్యర్థిని నిలబెడుతుందా? లేదా? అనే విషయం తనకు తెలియదని ఆయన స్పష్టం చేశారు.

Related posts