telugu navyamedia
ఆంధ్ర వార్తలు

వివేకా హత్య కేసు : బెయిల్ పిటిష‌న్ తిర‌స్క‌ర‌ణ‌..

మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక నిందితుడిగా ఉన్న గజ్జల ఉమాశంకర్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను కడప 4వ జిల్లా అదనపు కోర్టు న్యాయమూర్తి బుధవారం కొట్టివేశారు.

వివేకా హత్య కేసులో ఏ-1గా ఎర్రగంగిరెడ్డి, ఏ-2గా యాదటి సునీల్‌యాదవ్‌, ఏ-3గా గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, ఏ-4గా డ్రైవర్‌ షేక్‌ దస్తగిరిలపై అభియోగం మోపుతూ సీబీఐ గతేడాది అక్టోబరు 27న పులివెందుల కోర్టులో తొలి ప్రాథమిక చార్జిషీట్‌ నమోదుచేసింది. వీరిలో ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌పై ఉన్నారు. దస్తగిరి అప్రూవర్‌గా మారారు. సునీల్‌ యాదవ్‌, ఉమా శంకర్‌రెడ్డి, డి.శివశంకర్‌రెడ్డి కడప సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఉమా శంకర్‌రెడ్డి ఈ నెల 3న బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు

ఉమాశంకర్‌రెడ్డి కి బెయిల్‌ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని క‌డ‌ప‌కోర్టులో సీబీఐ వాదనలు వినిపించింది. వివేకాను హత్య చేయడానికి నలుగురు సహా నిందితులతో కలిసి కుట్రపన్నారని, ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేయాలని సీబీఐ అభిప్రాయపడింది. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, ఇతర సామాగ్రిని, స్వాధీనం చేసుకోవాల్సిన తరుణంలో ఉమా శంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వడం సరైంది కాదని వాదించింది.

వివేకాను ఆయ‌న‌ ఇంట్లో ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దస్తగిరిలు కలిసి హత్య చేశారని, ఆ సమయంలో వివేకా తలపై గొడ్డలితో తొలి దాడి చేసింది ఉమా శంకర్ రెడ్డినే అని దర్యాప్తులో తేలినట్లు స్పష్టం చేసింది.

అంతేకాదు, వివేకాను స్నానాల గదిలో పడేసిన తర్వాత మరో ఐదారు సార్లు తలపైన గొడ్డలితో ఉమా శంకర్ రెడ్డే నరికాడని వివరించింది. హత్య జరిగిన రోజున వేకువ జామున మూడు గంటల 15 నిమిషాలకు పారిపోతున్నట్లు వివేకా ఇంటి సమీపంలోని సీసీటీవీ దృశ్యాల్లో స్పష్టంగా కనిపించినట్లు తెలిపింది.సిబిఐ వాదనతో ఏకీభవించిన కడప కోర్టు ఆయన బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది.

ఇదే కేసులో దస్తగిరి, రంగన్న (వివేకా ఇంటి వాచ్‌మన్‌) భద్రతపై కడప సెషన్స్‌ కోర్టులో సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ 25కు వాయిదా పడింది.

Related posts