telugu navyamedia
ఆంధ్ర వార్తలు

బాధ‌లు త‌ట్టుకోలేక అప్రూవ‌ర్‌గా మారా..

*వివేకా హ‌త్య కేసు నిందితుడు ద‌స్త‌గిరి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..
*బాధ‌లు త‌ట్టుకోలేక అప్రూవ‌ర్‌గా మారా..
*నా భార్య బిడ్డ‌లు అనాధ‌ల‌వుతార‌నే సీబీఐకి చెప్పా..
*నా ప్రాణాల‌కు భ‌ద్ర‌తా సీబీఐకి కోరా..

మాజీ మంత్రి వివేకా హత్య కేసుకు సంబంధించి.. సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. కేసు నిందితుల్లో ఏ4గా ఉన్న డ్రైవర్ దస్తగిరిని.. సీబీఐ అధికారులు సోమవారం.. కడప జిల్లా పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. అప్రూవర్​గా మారిన అతని చేత.. సీబీఐ రెండవసారి మెజిస్ట్రేట్ ముందు సెక్షన్ 164 కింద వాంగ్మూలం నమోదు చేయించారు.

వాంగ్మూలం ఇచ్చాక తనను కలిసిన వారిపై దస్తగిరి… సీబీఐకి ఫిర్యాదు చేశాడు. అందుకు సంబంధించిన వివరాలను సెప్టెంబర్ 30న సీబీఐకి ఇచ్చాడు..

తన వాంగ్మూలం నమోదు తర్వాత భరత్ యాదవ్ కలిశాడు. అవినాష్‌రెడ్డి తోట వద్దకు రావాలని భరత్‌ యాదవ్‌ అడిగాడు. నేను ఉండే ఇంటి సమీప హెలిపాడ్ వద్దకు భరత్ యాదవ్‌, న్యాయవాది వచ్చారు. భాస్కర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి పంపించారని.. 10-20 ఎకరాల భూమి ఇస్తామన్నారని చెప్పారు. ఎంత డబ్బు కావాలో చెప్పమన్నారు. భరత్‌ యాదవ్ తనను తరచుగా అనుసరిస్తున్నాడు’ అని దస్తగిరి తన స్టేట్​మెంట్​లో పేర్కొన్నాడు

కాగా ..గతేడాది నవంబర్ 26న దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు కడప కోర్టు అనుమతిచ్చింది. గతేడాది ఆగస్ట్‌ 31న ప్రొద్దుటూరు కోర్టులో దస్తగిరి తొలిసారి మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చాడు. మొదటి సారి 164 వాంగ్మూలం ఇచ్చిన దస్తగిరి వివేకా హత్యకు సంబంధించి పాత్ర సూత్రదారుల గురించి చెప్పడం జరిగింది.

ఎర్రగంగి రెడ్డి హత్యకు ప్లాన్ చేశాడని, 40 కోట్లు సుఫారి ఒప్పందం జరిగిందని ఈ మేరకు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి మధ్యవర్తిగా ఉన్నాడని ఆయన నుండి మనకు డబ్బు అందుతుందని, మీరు ఏమి భయపడాల్సిన పనిలేదని దీని వెనుక పెద్దలు ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి ఉన్నారని వారి నుంచే మనకు కమిట్ అయిన డబ్బులు వస్తాయని ఎర్రగంగిరెడ్డి చెప్పినట్లు దస్తగిరి అప్పటి 164 వాంగ్మూలంలో చెప్పినట్లు వెలుగులోకి వచ్చింది. 

మ‌రోవైపు..ప్రధాన నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరిలను సీబీఐ అధికారులు పులివెందుల మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కేసులో ముగ్గురు నిందితుల రిమాండ్ గడవును న్యాయస్థానం.. 14 రోజుల పాటు పొడిగించింది.

కడప జైలులో ఉన్న సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డిలను కొంత ఆలస్యంగా కోర్టుకు తీసుకువచ్చారు. మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి అనారోగ్య కారణాలతో కోర్టుకు హాజరుకాలేదు. శివశంకర్‌రెడ్డి ప్రస్తుతం కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.

Related posts