telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రతిపక్షాలు చేతులకు గాజులు వేసుకుని.. కేసీఆర్ ముందు డ్యాన్సులు చేస్తున్నాయి : షర్మిల

సిఎం కెసిఆర్ పై వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులు చనిపోతే చలించని ఛాతీలో ఉంది గుండెనా బండరాయా? పాలకులకు చిత్తశుద్ధి ఉందా? ప్రజలు అందరూ చూడాలని పేర్కొన్నారు. నేను ఉద్యోగ దీక్ష ఎందుకు చేసానో అందరికి తెలుసని.. రాష్ట్రంలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని తెలిపారు. ఉద్యోగాలు రాక ఆత్మాభిమానం చంపుకోలేక మానసికంగా రోజు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులు చనిపోయేలా చేసింది కేసీఆర్ అని.. కేసీఆర్ ఒక మర్దరర్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వేల ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేశారని.. రాష్ట్రంలో నియంత పాలన ఉందన్నారు. ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు చేతులకు గాజులు వేసుకుని కేసీఆర్ ముందు డ్యాన్సులు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. పాలకులకు భయం లేదని.. వెనకాల దాక్కుని పోలీసుల భుజాల మీద తుపాకి పెట్టుకుని మమ్మల్ని టార్గెట్ గా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. మమ్మల్ని హింసించారని డిజిపికి ఫిర్యాదు చేయడానికి వెళ్తే కనీసం ఫిర్యాదు తీసుకోలేదని.. పోలీసులు ఇందుకేనా జీతాలు తీసుకునేది? అని నిలదీశారు. పాలకులకు సిగ్గుండాలి… ఒక మహిళ పైనా మీ ప్రతాపమా? అని ప్రశ్నించారు షర్మిల. రాష్ట్రంలో 11 యూనివర్సిటీలున్నాయని… అందులో 67 శాతం ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసే వరకు తాను పోరాటం చేస్తానని పేర్కొన్నారు. నేను పోరాడుతా. ఈ పోరాటం ఆగదు. నేను నిలబడతా.. మిమ్మల్ని నిలబెడుతానని తెలిపారు. నేను రాజన్న బిడ్డను… మాట మీద నిలబడతానని స్పష్టం చేశారు.

Related posts