telugu navyamedia
రాజకీయ

నేషనల్ హెరాల్డ్ కేసు ఆఫీస్‌కు సీల్‌.. సోనియా ఇంటి వద్ద భారీగా పోలీసులు

నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో దూకుడు పెంచింది. మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా న్యూఢిల్లీలోని నేషనల్ హెరాల్డ్ భవనంలో ఉన్న యంగ్ ఇండియన్ లిమిటెడ్ కార్యాలయాన్ని ఈడీ అధికారులు ఇవాళ సీల్‌ చేశారు . ఈడీ అనుమతి లేకుండా కార్యాలయం తెరవకూడదని అధికారులు స్పష్టం చేశారు.

ఇప్పటికే నేషనల్‌ హెరాల్డ్‌ కేసు విచార‌ణ‌లో.. సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలను ఈడీ గంటల తరబడి ప్రశ్నించిన విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీలోని నేషనల్ హెరాల్డ్ హౌస్ లో నేషనల్  హెరాల్డ్ కార్యాలయాలపై ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టరేట్  అధికారులు నిన్న సోదాలు చేశారు. ఏజేఎల్ తో అనుసంధానించిన మరో పదకొండు ప్రాంతాల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.. ఈ క్రమంలో యంగ్‌ ఇండియన్‌ లిమిటెడ్‌ ఆఫీస్‌కు సీల్‌ వేసింది ఈడీ.

నేషనల్‌ హెరాల్డ్‌ వార్తాపత్రికను ప్రచురించే అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌(ఏజేఎల్‌) కంపెనీని కొనుగోలు చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలపై 2012 నవంబరు 1న ఢిల్లీలోని ఓ కోర్టులో బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ప్రైవేటు కేసు దాఖలు చేశారు. వారిద్దరూ మోసానికి పాల్పడ్డారని, ఏజేఎల్‌కు చెందిన వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములను కాజేశారని సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు.

ఢిల్లీ, యూపీ తదితర ప్రాంతాల్లో ఏజేఎల్‌కు ఉన్న రూ.1,600 కోట్ల విలువైన ఆస్తులను వారిద్దరూ యజమానులుగా ఉన్న యంగ్‌ ఇండియన్‌ కంపెనీ ద్వారా మోసపూరితంగా దక్కించుకున్నారని పేర్కొన్నారు. ఈ కేసులోనే మనీలాండరింగ్‌ ఆరోపణలపై విచారణ జరిపిన ఈడీ సోనియా, రాహుల్‌లకు సమన్లు జారీ చేసింది. ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. గత నెల జులైలో సోనియాని ఈడీ దాదాపు 12 గంటలు ప్రశ్నించింది. 100కిపైగా ప్రశ్నలు సంధించింది. అంతకుముందు రాహుల్ గాంధీని కూడా 5 రోజులకుపైగా 150కిపైగా ప్రశ్నలు అడిగిన విషయం తెలిసిందే.

మ‌రోవైపు నేషనల్ హెరాల్డ్ కేసులో సోదాలు, యంగ్ ఇండియన్​ కార్యాలయం సీజ్ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం, జన్​పథ్​లోని ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఇంటి వద్ద భారీ సంఖ్యలో మోహరించారు. ఢిల్లీ ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లే రోడ్డును ఎందుకు బ్లాక్​ చేశారని కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్​ ప్రశ్నించారు. ఇది ఆనవాయితీగా మారిందని ఆరోపించారు. ఇలా ఎందుకు చేస్తున్నారో మిస్టరీగా ఉందని అభిప్రాయపడ్డారు.

Related posts