ఉత్తర్ ప్రదేశ్ లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గురువారం చోటు చేసుకున్న హింసాత్మక పరిస్థితులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించినప్పటి నుంచీ ఉత్తర్ ప్రదేశ్ లో పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉంటూ వచ్చాయి. నిరసన ప్రదర్శనలు గానీ, వ్యతిరేక ఆందోళనలు గానీ చోటు చేసుకున్న సందర్భాలు పెద్దగా కనిపించలేదు. గురువారం మాత్రం ఒక్కసారిగా ఉత్తర్ ప్రదేశ్ లో వాతావరణం మారిపోయింది. పరిస్థితి అదుపు తప్పింది. హింసాత్మక వాతావరణం పతాక స్థాయికి చేరుకుంది. రాజధాని లక్నో సహా సంబల్ లో ఆందోళనకారులు భారీ ఎత్తున ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి పాల్పడ్డారు.
సంబల్ లో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన రెండు బస్సులను తగుల బెట్టారు. లక్నోలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. ఓ పోలీస్ ఔట్ పోస్టుకు నిప్పు పెట్టారు. ఈ వ్యవహారంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆగ్రహం నషాళానికి అంటినట్టయింది. అంతా సర్దుకుంటుందనుకుంటున్న తరుణంలో హింస చెలరేగడం పట్ల ఆయన మహోగ్ర రూపం దాల్చారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై పగ తీర్చుకుంటానని హెచ్చరించారు. ఆందోళనకారుల జాతకాలన్నీ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయని, వాటి ఆధారంగా వారిని గుర్తిస్తామని చెప్పారు. ఏ ఒక్కర్నీ విడిచి పెట్టబోమని, ఆందోళనకారులను అరెస్టు చేస్తామని అన్నారు. వారి ఆస్తులను వేలం వేసి మరీ.. ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకుంటామని అన్నారు. ప్రతి పైసాను ఆందోళనకారుల నుంచే వసూలు చేస్తామని చెప్పారు.