గుంటూర్ జిల్లాలోని చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ మరిది గోపినాథ్‌పై నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడికి పాల్పడ్డారు. విడదల వారి ప్రభను కోటప్పకొండలో వదిలి కారులో ఇంటికి వస్తున్న సమయంలో దుండగులు ఆయన కారుపై రాళ్లతో దాడిచేశారు. ఈ ఘటనలో ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.
ఇటీవల ఓ కార్యక్రమానికి వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు రాగా.. స్థానిక ఎమ్మెల్యే రజనీకి సమాచారం ఇవ్వకుండా ఎలా వస్తారని గోపినాధ్ అడ్డుకున్నారు. అయితే ఆ మరుసటి రోజే రజనీ మరిదిపై దాడి జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎంపీ వర్గమే ఈ ఘటనకు పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. దాడి ఘటనపై గోపినాథ్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.