telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

కేంద్ర ప్రభుత్వంలోకి వైసీపీ.. బీజేపీ ఆఫర్ ఇదే !

jagan modi

పులివెందుల భాకారాపురంలోని వైఎస్సార్‌ ఆడిటోరియంలో జరిగిన డాక్టర్ గంగిరెడ్డి సంస్మరణ సభలో సీఎం జగన్‌ పాల్గొన్నారు. గంగిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్ విజయమ్మ, ఎంపీలు విజయసాయిరెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. గంగిరెడ్డి జ్ఞాపకాలను స్మరించుకున్నారు. ఇక జగన్‌ ఇవాళ సాయంత్రం ఢిల్లీ పర్యటనకు వెళ్తారు. రేపు ప్రధానితో ఆయనకు అపాయింట్‌ మెంట్ ఖరారైనట్లు తెలుస్తోంది. మోడీతో భేటీలో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీద చర్చ జరగనుందని అంటున్నారు.

 

ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం, మండలి రద్దు, జీఎస్టీ బకాయిలు తదితర అంశాల ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. అలాగే వైసీపీకి కేంద్ర కేబినెట్‌ లో ఛాన్స్ దక్కనుందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్డీఏ జగన్ పార్టీకి మంత్రి పదవుల్ని ఆఫర్ చేసిందని.. అందుకే ఆయన హుటాహుటిన ఢిల్లీ వెళుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రధాని ఈ అంశం మీద చర్చించబోతున్నారని చెబుతున్నారు. ఎన్డీఏ వైసీపీకి మొత్తం మూడు క్యాబినెట్ బెర్తులు ఇస్తామని ఆఫర్ చేసిందని.. అందుకే జగన్‌ ను హస్తినకు బీజేపీ పెద్దలు పిలిపించారని ప్రచారం జరుగుతోంది. కానీ అసలు ఇప్పటి వరకు అలాంటి ఆలోచనగాని, ప్రతిపాదనగాని లేదని వైసీపీ స్పష్టం చేసింది. ఈ ప్రచారం మీద ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Related posts