తనపై కేసులు లేకుండా చేసుకునేందుకే చంద్రబాబు టీడీపీ ఎంపీలను బీజేపీలోకి పంపిస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య అన్నారు. టీడీపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహన్ రావు తదితరులు టీడీపీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నారంటూ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఓవైపు టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ యాత్రలో ఉన్న తరుణంలో ఇలాంటి కథనాలు తెరపైకి రావడం గమనార్హం. అయితే, ఈ కథనాలపై .రామచంద్రయ్య మీడియ సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ ఎంపీలు బీజేపీ వైపు చూడడం అనేది చంద్రబాబు వికృత రాజకీయాల్లో భాగమేనని ఆరోపించారు.
గతంలో ఓటుకు నోటు కేసులో తాను ఇరుక్కున్నప్పుడు కేసుల నుంచి తప్పించుకోవడానికి నామా నాగేశ్వరరావును టీఆర్ఎస్ లోకి పంపించారని, ఆ తర్వాత మండవ వెంకటేశ్వరరావును కూడా ప్రోత్సహించారని తెలిపారు. ఇప్పుడు అదే తరహాలో తన పార్టీ నుంచి నలుగురిని బీజేపీలోకి పంపడం ద్వారా తన అవినీతి, అక్రమాలను వెలుగులోకి రాకుండా జాగ్రత్తపడుతున్నారని సి.రామచంద్రయ్య ఆరోపించారు.