దళిత మహిళా ఎస్‌ఐని కులం పేరుతో దూషించడం దారుణమని ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి మండిపడ్డారు. మంత్రి తానేటి వనితతో కలసి ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ సీనియర్ మహిళా నేత నన్నపనేని రాజకుమారి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆమె తీవ్రంగా ఖండించారు. గతంలో చంద్రబాబు నాయుడు, ఆదినారాయణరెడ్డిలు కూడా దళితులను ఇలానే అవమానించారని ధ్వజమెత్తారు.
టీడీపీ నేతలు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కులం పేరుతో అవమానించి కన్నీళ్లు పెట్టించారని దుయ్యబట్టారు. దళిత మహిళా ఎస్‌ఐను దూషించడం, టీడీపీ అగ్రకుల దురహంకారానికి నిదర్శనమని అన్నారు. గతంలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా పనిచేసిన నన్నపనేని రాజకుమారి..దళిత మహిళా ఎస్‌ఐని అవమానించడం సిగ్గుచేటని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. దళితులను టీడీపీ నేతలు దూషించడం దారుణమన్నారు.