telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వైసీపీ.. తొలి జాబితాలో 70-100 మందికి చోటు… సంక్రాంతి తరువాత విడుదల…

YCP released MLA Candidates List

వైసీపీ పార్టీ జగన్ పాదయాత్ర ముగుస్తుండటంతో ఇక రాబోయే ఎన్నికలకు జాబితా సిద్ధం చేయడంలో మల్లగుల్లాలు పడుతుంది. ఈ జాబితా సంక్రాంతి తరువాత విడుదల చేసే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తుంది. తొలిజాబితాలో దాదాపు 100 మంది పేర్లు ఉండవచ్చని సమాచారం. వైసీపీ అధినేత ప్రకటించే తొలి జాబితాలో రాష్ట్రంలోని సిట్టింగ్‌ ఎమ్మెల్యేలతోపాటు సర్వేలో మెరుగైన స్థానంలో నిలవడంతోపాటు ఆర్థికంగా పటిష్ఠంగా ఉన్నట్టు తేలిన వారికి చోటు కల్పించినట్టు తెలిసింది. వర్గ విభేదాలు, టిక్కెట్టు కోసం ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతున్న స్థానాలలో అభ్యర్థుల ఎంపికను వాయిదా వేసినట్టు తెలిసింది. తొలి జాబితాలో రాష్ట్రవ్యాప్తంగా 70-100 మందికి స్థానం కల్పించనున్నట్టు పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

తొలి జాబితాలో విశాఖ జిల్లా నుంచి ముగ్గురు లేదా నలుగురికి మాత్రమే చోటు దక్కనున్నట్టు సమాచారం. మాడుగుల టిక్కెట్‌ను అక్కడి సిట్టింగ్‌ ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడుకు ఖరారు చేయగా, ఎలమంచిలి సీటుని మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజుకు కేటాయించినట్టు సమాచారం. అలాగే చోడవరం టిక్కెట్‌ను గత ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి ఖరారు చేసినట్టు తెలిసింది. అనకాపల్లి సీటును గుడివాడ అమర్‌నాథ్‌కు ఇవ్వాలనుకుంటున్నప్పటికీ ఆయన పెందుర్తి అడుగుతున్నట్టు తెలిసింది. కొణతాల రామకృష్ణ లేదా దాడి రత్నాకర్‌లలో ఎవరైనా పార్టీలోకి వస్తే సమీకరణాలు మార్చాల్సి ఉంటుందనే భావనతో అభ్యర్థిత్వాన్ని పెండింగ్‌లో పెట్టినట్టు సమాచారం. మొత్తానికి పార్టీలో అంతర్గత విభేదాలకు మంచి వేదికగా ఈ జాబితా విడుదల కార్యక్రమం కానుంది, ఇది అన్ని పార్టీలలో ఉండేదే అయినప్పటికీ, వైసీపీ ఏపీలో బలమైన ప్రతిపక్షంగా ఉన్నందున, ఆ పార్టీలో ఇలాంటి ఘటనలు బయటకు వస్తే, ఇతర పార్టీలు తమకు అనుకూలంగా ఈ సందర్భాలను మార్చేసుకుంటారు. అది భారీనష్టాన్నే చేకూర్చే అవకాశం ఉంది. .. చూద్దాం ఈ సినిమా హిట్టా ఫట్టా అనేది.

Related posts