telugu navyamedia
రాజకీయ వార్తలు సినిమా వార్తలు

NTR అనే 3 అక్షరాలు విన్నా, చదివినా ఒళ్ళు పులకరించిపొయ్యేంత అభిమానం: యాగంటి వెంకటేశ్వరరావు

నాకిప్పుడు 61 యేళ్ళు. సరిగ్గా 50 యేళ్ళ క్రితం నా 11 వ యేట అంటే నేను 6 వ తరగతిలో ఉన్నప్పుడు మొదలయింది ఈ అభిమానం. మాది గుంటూరు జిల్లా దుర్గి మండలం లోని జంగమహేశ్వరపాడు అనే కుగ్రామం. సినిమా చూడాలి అంటే మా ఊరికి 12 కి.మీ. దూరం లో ఉండే మాచెర్ల కి పోవాలి కాబట్టి 5 వ తగతి వరకు చాలా తక్కువ సినిమాలు చూశాను, ఏ సినిమాలు చూశానో కూడా గుర్తులేదు. 5 తర్వాత హైస్కూల్ కు రెంటచింతల లో హస్టల్లో చేర్పించాడు మానాన్న.

యాగంటి వెంకటేశ్వరరావు

6 వ తరగతి లో చేరిన 5-6 నెలలకు రెంటచింతల లోని టూరింగ్ టాకీస్ లో సినిమా చూడటానికి హస్టల్ లో పర్మిషన్ ఇచ్చారు. దాదాపు హస్టల్ లో ఉన్న అన్ని క్లాసుల వాళ్ళు వచ్చారు సినిమాకి. హాల్ దగ్గరికెళ్ళిన తర్వాత తెల్సింది సినిమా ఏంటో. రక్తసంబంధం. మిగిలిన హస్టల్ ఫ్రెండ్స్ కి ఎలా ఉందో తెలియదు గానీ నేనైతే సినిమాలో పూర్తిగా లీనమై పోయానంట. నా పక్కన కూర్చున్నతను చెప్పాడు, నేను సినిమాలో చాలావరకు ఏడ్చానని. నాకు తోబుట్టువు ఒక్కతే, మా అక్క. హస్టల్ లో ఉండి చాలా రోజులు అక్కకు దూరంగా ఉండటాన, సినిమాలో ఎన్.టీ.ఆర్., సావిత్రి లు పండించిన అన్నచెల్లెళ్ళ అనురాగం నా గుండెని కదిలించాయి.

అప్పట్నుంచే పెద్దాయనటే అభిమానం అలా మొదలయింది. అంత ట్రాజిడీ సినిమా కి అంత చిన్న వయసులో అంతలా కనెక్ట్ అవ్వటానికి కేవలం ఎన్.టీ.ఆర్. నటన మాత్రమే ప్రభావం చూపించింది. అప్పట్నుంచి స్కూల్ లో కానీ, బయట కానీ ఎన్.టీ.ఆర్. సినిమాలు గురించి ఎవరన్నా మాట్లాడుతుంటే మంత్రముగ్ధున్నై వింటుండేవాణ్ణి.

అప్పట్లో రక్తసంబంధం తర్వాత ఎన్.టీ.ఆర్. తో ఒక అలౌకిక అవినాభావ సంబంధం ఏర్పడటానికి దోహదపడ్డ సినిమాలు పాండురంగ మహత్యం, శ్రీ వెంకటేశ్వర మహత్యం, లవకుశ, రైతుబిడ్డ, దేవుడు చేసిన మనుషులు, దేశోద్ధారకులు మొదలైనవి. ఆరోజుల్లో సినిమాలు చూసే అవకాశాలు తక్కువ, సెలవలకు ఊరెళ్ళేటప్పుడు, మళ్ళీ సెలవలయ్యాక హస్టల్ కి వచ్చేటప్పుడు మాచెర్ల లో 2 షోలు చూసేవాణ్ణి, హస్టల్ వాళ్ళు పర్మిషన్ ఇస్తే రెంటచింతలలో 2-3 నెలలకొక సినిమా చూసేవాణ్ణి. ఈ క్రమం లో అక్కినేని గారి సినిమాలు కూడా కొన్ని చూశాను కానీ ఒక్కటీ నచ్చేదికాదు.

8వ తరగతికి తాడికొండ రెసిడెన్షీల్ స్కూల్ కి సెలక్టై అక్కడికెళ్ళాను. తాడికొండ వెళ్ళాలంటే గుంటూరు మీదగానే వెళ్ళాలి నేను. తాడికొండ లో చేరిన తర్వాత మజహరుల్ హక్ అనే క్లాస్మేట్ బాగా క్లోజ్ అయ్యాడు, తర్వాత రోజుల్లో బెస్ట్ ఫ్రెండ్స్ మి అయ్యాము. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కావటానికి ఒకేఒక్క కామన్ ఇంట్రెస్ట్ ఎన్.టీ.ఆర్. వాడిది ప్రకాశం జిల్లా దోర్నాల, ఎన్.టీ.ఆర్. కి వీరాభిమాని అప్పటికే. వాడు చూసిన సినిమాల్లో ఎన్.టీ.ఆర్. వేషాలగురించి చెప్తుంటే టైమే తెల్సేది కాదు. 10 వ తరగతి అయ్యేవరకు మా ఇద్దరిదీ విడదీయరాని బంధమయింది. సో సెలవలకి వెళ్ళేప్పుడు మళ్ళీ వెనక్కి స్కూల్ కొచ్చేటప్పుడు ఇద్దరం కలిసి 2-3 సినిమాలు చూసేవాళ్ళం గుంటూరు లో. ఎన్.టీ.ఆర్. సినిమా కొత్తదేదన్నా ఉంటే అన్ని షోలూ అదే ఇంక.

తాడికొండ స్కూల్ లో ఉన్నప్పుడు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. మా ప్రిన్సిపాల్ గారు సుగుణమ్మ గారు పిల్లల్ని సొంత బిడ్డల్లా చూసుకుంటూ బాగా చదివించేవారు. టెంత్ పరీక్షలప్పుడు రాత్రి 11 దాకా మిగిలిన టీచర్లతోపాటు ఆవిడ కూడా దగ్గరుండి చదివించేవారు. హక్ కి స్టేట్ రాంక్ వస్తుందని టాక్ ఉండేది కాబట్టి వాడిమీద స్పెషల్ పర్యవేక్షణ ఉండేది పరీక్షలప్పుడు. రేపు లాస్ట్ ఎక్జాం సోషల్ 2 పరీక్ష ఉందనగా తాడికొండ హాల్ కి నిప్పులాంటిమనిషి వచ్చింది. అప్పటికే అది సూపర్ హిట్టైన సంగతి తెల్సు కాబట్టి, దాన్లో ఎన్.టీ.ఆర్. అద్భుతంగా నటించాడన్న సంగతి వినబట్టి ఆగలేకపొయ్యాము సెకండ్ షో కి వెళ్ళకుండా. అప్పటికే చాలాసార్లు సెకండ్ షోలకి స్కూల్ గోడ దూకి వెళ్ళటం అలవాటే కాబట్టి ఈజీ గా వెళ్ళాం హాల్ కి. అప్పట్లో మేమొక విషయం అర్ధం చేసుకుని ఓన్లీ బెంచీ క్లాస్ కే వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే నేల క్లాసుకి స్కూల్ ప్యూన్లు, కుక్ లు లాంటి వాళ్ళు, కుర్చీ క్లాస్ కి టీచర్లు, క్లర్కులు లాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళ కళ్ళల్లో పదకుండా ఉండటానికి బెంచీ కే వెళ్ళేవాళ్ళం. ఆరోజుకూడా బెంచీకే వెళ్ళాం.

అక్కడ స్కూల్ రాత్రి స్టడీ అవర్ లో హక్, నేను కనపడకపొయ్యేసరికి అక్కడున్న టీచర్లకి డౌటొచ్చింది మేము నిప్పులాంటిమనిషికి వెళ్ళుంటామని. వెంటనే సుగుణమ్మ గారు, ఇద్దరు టీచర్లు, ఇద్దరు సబ్ – స్టాఫ్ తో కలిసి థియేటర్ కి వచ్చారు. ఆ సినిమా మొదట్లో ప్రభాకర్ రెడ్డి విలన్ గా ఎన్.టీ.ఆర్. కుటుంబం మొత్తాన్ని ఒక దీపావళి రాత్రి వచ్చి చంపుతాడు. కరెక్ట్ గా ప్రభాకర్ రెడ్డి ఎన్.టీ.ఆర్. ఇంట్లోకి ఎంటర్ అయిన టైం లో సుగుణమ్మ గారు మిగిలిన వాళ్ళతో కలిసి థియేటర్లోకి ఎంటరయ్యి టార్చ్ లైట్లతో ముఖాలు చూడ్డం మొదలు పెట్టారు. 5 నిమిషాల్లో మేము పట్టుబడ్డాం. రేపు లాస్ట్ ఎక్జాం కాబట్టి ఆమె ఏమీ అనలేదు కానీ చాలా ఆశ్చర్యపోయింది, ఒక్కరోజాగి రేపు చూడకుండా ఎక్జాం పెట్టుకుని ఈరోజే వచ్చినందుకు. అన్నగారంటే మా వీరాభిమానానికి అదొక తీపి గుర్తు.

ఆతర్వాత ఇంటర్ లో నాగార్జున సాగర్ రెసిడెన్షీల్ కాలెజ్ కి వెళ్ళాను. ఇంటర్ ఫస్టియర్ తర్వాత సెలవల్లో గుంటూరెళ్ళి అక్కడే చదువుతున్న హక్ తో కలిసి దానవీరశూర కర్ణ తనివితీరా మాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో చూశాము. అలాగే నెక్స్ట్ డే అడవిరాముడు కూడా మోర్నింగ్ షో నుంచి సెకండ్ షో దాకా మొత్తం 4 షోలు చూశాము. వారం గుంటూర్లో ఉండి ప్రతిరోజూ 2 సార్లు దానవీరశూర కర్ణ, 2 సార్లు అడవిరాముడు చూశాము. సాగర్ కాలెజ్ లో ఫ్రెండ్స్ నన్ను అడవిరాముడు అనేవాళ్ళు, దాన్ని మొత్తం 50 సార్లకు పైగా చూసినందుకు.

ఇంటరయ్యాక 1978 లో మెడిసిన్ సీట్ ఎంట్రెన్స్ కోచింగ్ కు గుంటూర్ లో చేరాను. అప్పట్లో పాతసినిమాలు మోర్నింగ్ షోలు గా వేసేవాళ్ళు చాలా థియేటర్లలో. ప్రతిరోజూ ఏదో ఒక పాత ఎన్.టీ.ఆర్. సినిమా చూసేవాణ్ణి. ఇంకో వారం లో ఎంట్రెన్స్ ఎక్జాం ఉందనగా యుగపురుషుడు రిలీజయింది. ఆ వారం లో దాన్ని 20 సార్లకు పైగా చూశాను చదువుమీద దృష్టి పెట్టకుండా. ఫలితం 1.5 మార్కుల తేడాతో మెడిసిన్ సీట్ మిస్సయ్యాను టెంత్ లో స్టేట్ 11త్ రాంక్ వచ్చినా సరే.

మెడిసిన్ సీట్ రాక బాపట్లలో అగ్రికల్చరల్ బి.ఎస్సీ. లో చేరాను. అక్కడ 4 థియేటర్లుండేవి. కొత్తసినిమాలు రిలీజైన 3-4 నెలలకు బాపట్లొచ్చేవి. సూపర్ హిట్టైన సినిమాలు ఇంకొద్దిగా లేట్ గా వచ్చేవి. వచ్చిన ఎన్.టీ.ఆర్. సినిమాలు మొత్తం మళ్ళీ మళ్ళీ చూసేవాణ్ణి, హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా. ఎన్.టీ.ఆర్. కొత్తసినిమాలకి 17 కిలోమీటర్ల దూరం లో ఉన్న చీరాల వెళ్ళి చూసేవాణ్ణి ఫస్ట్ డే ఫస్ట్ షో. డ్రైవర్ రాముడు, వేటగాడు లాంటివి మొదటిరోజు మొత్తం 4 షోలు చూశాను. నేను చూసిన తర్వాత ఫ్రెండ్స్ ని తీసుకెళ్ళి చూపించేవాడిని.

తాడికొండ లో లాగానే బాపట్లలో కూడా ఒక సంఘటన జరిగింది. అప్పట్లో ఏజీ బి.ఎస్సీ. లో పాస్ 60% ఉండేది. 3 వసంవత్సరం లో 30 మార్కులకుండే సాయిల్ సైన్స్ పీరియాడికల్ ఎక్జాం రోజు సర్దార్ పాపారాయుడు రిలీజయింది. 30 మార్కులు పోతే ఆల్మోస్ట్ ఫైలౌతారు చాలామంది, అయినాసరే ఎక్జాం వదిలేసి చీరాలెళ్ళి పాపారాయుడు ని తనివితీరా 4 సార్లు చూసి వచ్చాను. ఫ్రెండ్సందరూ కుక్క తిట్లు తిట్టారు. తర్వాత వచ్చే క్విజ్, ఫైనల్ ఎక్జాం లకు నిద్రలేకుండా చదివి 61 మార్కులతో సాయిల్ సైన్స్ పాసయ్యాను.

ఫైనలియర్ ఫైనల్ ఎక్జాంస్ ముందు 1982 మార్చ్ 29 న తెలుగుదేశం పార్టీ పెడుతున్నట్టు పెద్దాయన ప్రటించారు. ఆరోజు చాలా బాధేసింది ఇంక ఆయన కొత్తసినిమాలు రావని. తర్వాత పార్టీకి ప్రజల్లో వస్తున్న స్పందన చూసి ఎన్.టీ.ఆర్. సి.ఎం. అవుతారు కాబట్టి కొత్తసినిమాలు రాకపోయినా పర్వాలేదులే అని సరిపెట్టుకున్నాను.

బాపట్ల చదువయ్యాక గుంటూర్ లో ఉద్యోగం. నెల్లూర్ నుంచి శ్రీకాకుళం దాకా నా టెరిటరి. ఏ ఊరెళ్ళినా నైట్ సెకండ్ షో ఏదో ఒక ఎన్.టీ.ఆర్. సినిమా చూడాల్సిందే. అక్కా వాళ్ళు ఒంగోలు లో ఉంటారు కాబట్టి ఉద్యోగరీత్యానే కాకుండా సెలవరోజుల్లో తరచుగా ఒంగోలు వెల్తుండేవాణ్ణి. ఈ క్రమం లోనే ఒంగోలు ఎన్.టీ.ఆర్. ఫాన్స్ తో పరిచయాలు ఏర్పడ్డాయి. అప్పుడే చావలి సంజీవ రావు, తిలక్, ఆదెన్న (ఈయన తర్వాత సంతనూతలపాడు ఎమ్మెల్యే అయ్యరు) లాంటి కరుడుగట్టిన ఎన్.టీ.ఆర్. ఫాన్స్ కలిశారు. వాళ్ళతో కలిసి పార్టీ కి పంజెయ్యటం మొదలయింది. ఎన్.టీ.ఆర్. తెలుగుదేశం అధ్యక్షుడిగా మొదటిసారిగా ఒంగోలు వచ్చినప్పుడు ఒక 50 మంది ఫాన్స్ కి ప్రత్యేక బాడ్జీలిచ్చి ఆయనచుట్టూ కవచం లాగా ఉండమన్నారు.

అందులో నేనొకణ్ణి. ఆరోజే మొదటిసారి పెద్దాయనకి రక్తతిలకం దిద్దటం అనే ప్రక్రియ మొదలయింది రాష్ట్రం లో. 50 మందిలో కొంతమందిమి ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం బ్లేడ్ లు జేబుల్లో పెట్టుకుని వెళ్ళాము ఎన్.టీ.ఆర్. కి కవచం లాగా. బహిరంగ సభకి ముందుగా జరిగిన కార్యకర్తల సభలో ఆయన స్టేజీ మీదకి వెళ్ళగానే మాలో ఒకతను (పేరు గుర్తులేదు) జై ఎన్.టీ.ఆర్. అని బిగ్గరగా అరుచుకుంటూ ఆయన కాళ్ళమీద పడి, లేచి జేబులోనుంచి బ్లేడ్ తీసుకుని ఒక్కసారిగా బొటనవేలు కోసుకుని ఆయన నుదుట రక్తం అద్దాడు.

పెద్దాయనే కాకుండా స్టేజీ మీద, స్టెజీ కింద ఉన్నవాళ్ళంతా ఉలిక్కిపడి ఆశ్చర్యపోయారు ఊహించని ఆ సంఘటనకి. అతను బ్లేడ్ తీసి వేలు కోసుకుంటుంటే ‘ఏంట్రా నువ్వు చేసేపని, వద్దు కోసుకోబాకు ‘ అని పెద్దాయన అన్నారు. ఆయన అన్నసరే ఆగకుండా మేమందరం వరుసకట్టి బొటనవేళ్ళు కోసుకుని రక్త తిలకం దిద్దాం ఆరోజు. అప్పట్నుంచి ఆయన ఏ ఊరెళ్ళినా ఈ రక్తతిలకం ప్రోగ్రాం ఉండేది సభకు ముందు.

ఆ ప్రోగ్రాం తర్వాత బాగా చదువుకున్నవాడినని (ఫాన్స్ లో ఎక్కువమంది పెద్దగా చదువుకోరు) ఒంగోలు లో నాకు తెలియని చాలామంది ఫాన్స్ మిత్రులయ్యారు. అప్పుడు కాటూరి నారాయణస్వామి గారు జిల్లా ఇంచార్జ్. ఆయన పాతకాలపు రాజకీయవేత్త, స్పీడు తక్కువ. దాంతో ఫాన్సందరు కలిసి నన్ను పెద్దాయన దగ్గరికి హైదరాబాదు వెళ్ళి ఆయనకు నారాయణస్వామి గారిమీద కంప్లెయింట్ రాసి ఇయ్యమని పంపించారు.

రామకృష్ణ స్టూడియో కి వెళ్ళి ఫాన్స్ అసోసియేషన్ లెటర్ హెడ్ మీద రాసిన పేపర్ చూపిస్తే లోపలకి పంపాడు సెక్యూరిటీ అతను. అదే అన్నగారిని మొదటిసారి ఒక్కడినే కలవటం, చాలా నర్వస్ గా ఫీలౌతున్నాను. ఆయనుండే రూం కి వెళ్ళి అసిస్టెంట్ కి లెటర్ ఇస్తే 5 నిమిషాల్లో లోపలకి రమ్మని పిలుపొచ్చింది. భయంకరమైన నర్వస్నెస్ తో లోపలికెళ్ళాను. ఆయన చిద్విలాసంగా కుర్చీలో కూర్చొని ఏంటి అన్నట్టు చూశారు. నాకు నోటమాట లేదు, చేష్టలుడిగి ఆయన్నే చూస్తున్నా. ఏంటీ లెటర్, నారాయణస్వామి గారు మంచి వ్యక్తి, ప్రజలకోసం పనిచేస్తారని జిల్లా ఇంచార్జ్ చేశాను, మీకేంటి ఇబ్బంది అన్నారు.

అవేమీ నాకు వినపడలేదు ఆ క్షణం లో. అమాంతం ఆయన ముందున్న టేబుల్ పక్కనుంచి వెళ్ళి కాళ్ళమీద పడ్డాను. లే లే అంటూ వచ్చినపని చెప్పు అన్నారు. ఆయన్ని ఒక్కడినే కనులారా చూసి పాదస్పర్శ చేసినందుకు అప్పటికి తృప్తిపడి నారాయణస్వామి గారిగురించి 1 నిముషం చెప్పాను, ఆయన మంచివారే కానీ, స్పీడ్ లేదు, డబ్బులు లేవు ఖర్చుపెట్టి పార్టీకి ఊపు తేవటానికి అని. అప్పుడాయన ప్రకాశం జిల్లా విషయాలు అల్లుడుగారు వెంకటేశ్వర రావు గారు చూస్తున్నారు ఆయనదగ్గరికెళ్ళి చెప్పండి అంటే బయటకొచ్చాను. ఆయనదగ్గరున్న ఆ 2-3 నిమిషాలు ఒక అనిర్వచనీయమైన గొప్ప అనుభూతి.

84 ఆగస్ట్ సంక్షోభం: ఫాన్సందరం ఏదేదో చెయ్యాలనుకునేవాళ్ళం. రైలు పట్టాలు తగలబెట్టాలని, బస్సులు తగలబెట్టాలని. ఆయన నెలరోజుల్లోనే మళ్ళీ ముఖ్యమంత్రి కావడం తో మేము టెర్రరిస్టులు కాకుండా మిగిలిపోయాం.

తర్వాత 1987 మొదట్లో ఇంకో సంఘటన. మండలాల ఎలక్షన్స్ లో అన్నగారి ప్రచార రధం వెనక కొద్దిరోజులు తిరిగాను, అన్నగారు గుర్తిస్తారని కాదు, ఆయన గుర్తించలేదు కూడా, కానీ ఆయన్ని రోజూ కొంతసేపు కేవలం చూడటం కోసం. నేనలా ఉద్యోగన్ని గాలికొదిలేసి రిపోర్టులు రాయకుండా తిరిగేసరికి జీతమిస్తున్న కంపెనీ బాస్ నామీద యాక్షన్ ఎందుకు తీసుకోకూడదు అని షోకాజ్ నోటీసిచ్చారు. మొఖం చెల్లక రిజైన్ చేశాను. అప్పటికి నాకో కూతురు. ఉద్యోగం, సంపాదన లేదు. ఊరికెళ్ళాను కుటుంబం, కట్టుబట్టలతో. ఆర్ధికంగా ఇంట్లో ఏమీ బాగాలేదు.

బాంక్, ఇతర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగం సాధించాలని కాంపిటీటివ్ ఎక్జాంస్ కి ప్రిపేరవ్వటం మొదలు పెట్టాను. సంవత్సరం తిరక్కుండా ఏపీ ప్రభుత్వరంగ సంస్థ లో ఉద్యోగం వచ్చింది. జీతం తక్కువ కానీ లంచాలు బాగా వచ్చే ఉద్యోగం. అన్నగారి స్ఫూర్తితో లంచాలు తీసుకోకూడదని మానుకోవాలనుకునే టైం లో ఐ.టీ.సీ. సీడ్ డివిజన్ లో ఆఫర్ వచ్చింది. ఎగిరిగంతేసి జాయిన్ అయ్యాను, ఇంట్లోవాళ్ళూ, బయటివాళ్ళూ అందరూ ప్రభుత్వ ఉద్యోగం మానుకున్నందుకు విపరీతంగా క్రిటిసైజ్ చేసినా. అదే నాజీవితాన్ని మలుపు తిప్పింది. మొదటి కంపెనీలో సరిగ్గా పని చెయ్యకుండా ఉద్యోగం పోగొట్టుకున్నా కాబట్టి ఐ.టీ.సీ. ఉద్యోగం ఒక లైఫ్ లైన్ గా భావించి విపరీతంగా పంజేశాను. ఫలితం 4 యేళ్ళల్లో 2 ప్రమోషన్లు. పోగొట్టుకున్న ఆత్మవిశ్వాసం మళ్ళీ వచ్చింది. 5 యేళ్ళతర్వాత ఒక వింత బాస్ ఆదేశాలమీద గుజరాత్ కు ట్రాన్స్ఫరైతే వెళ్ళకుండా రిజైన్ చేసి బిజినెస్ పెట్టాను ఫ్రెండ్స్, చుట్టాల దగ్గర అప్పు చేసి. ఆ బిజనెస్సే వటుడింతై అన్నట్లు ఈరోజు నన్నీ స్థాయికి తెచ్చింది.

అన్నగారు మరణించినరోజు బాగా గుర్తు. అప్పటికి వారం ముందే రోడ్ నంబర్ 13 లోని పెద్దాయన ఇంటికెళ్ళి దర్శనం చేసుకున్నా, నేను ఇంకో ఫ్రెండ్. వారం లో చనిపోతారని అస్సలనిపించలేదు. జనవరి 18 న పొద్దున్నే తెల్సింది దుర్వార్త. నాభార్య అపర్ణ కూడా వస్తానంది చివరి దర్శనానికి. 7 నెలల మా అబ్బయిని తీస్కుని వెళ్ళాము లాల్ బహదూర్ స్టేడియానికి. చాలాసేపు క్యూలో నిలబడ్డాక షుమారు సాయంతరం 5 గంటలకి దొరికింది దర్శనం. అపర్ణ కూడా చిన్నపిల్లలాగా ఏడ్చింది చూడగానే. దర్శనం తర్వాత బయటికొస్తుంటే పుల్లరెడ్డి స్వీట్స్ పుల్లారెడ్డి గారు ‘ఎందుకమ్మా చిన్నపిల్లాడినేసుకుని వచ్చావు?’ అన్నారు అపర్ణ వైపు చూస్తూ. అపర్ణ మళ్ళీ ఏడ్చింది. అదిచూసి పుల్లారెడ్డి గారు దణ్ణం పెట్టి పైకి చూస్తూ ‘మహానుభావుడు ‘ అన్నారు.

అన్నగారి అభిమానిగా ఇన్ని సొంత విషయాలు ఎందుకు చెప్పాల్సొచ్చిందంటే, నాజీవితం లో జరిగిన అత్యంత ప్రభావపూర్వితమన సంఘటనలన్నింటికీ అన్నగారిమీద అభిమానం ఒకరకంగా కారణం. 1978 లో యుగపురుషుడు వల్ల మెడిసిన్ సీట్ రాకపోవటం, దాంతో అగ్రికల్చర్ బి.ఎస్సీ. చదవటం, ఆచదువుకు సంబంధించిన సీడ్ కంపెనీలో ఉద్యోగం చెయ్యటం, 1987 లో చైత్నన్య రధమెమ్మట తిరగటం వల్ల ఉద్యోగం పోవటం, దాంతో గవర్నమెంట్ జాబ్ లో చేరటం, అన్నగారి స్ఫూర్తితో లంచాల జాబ్ వదిలేసి మళ్ళీ ప్రైవేట్ జాబ్ ఐ.టీ.సీ. సీడ్ డివిజన్ లో చేరటం, ఐటీసీ ఇచ్చిన ఆత్మవిశ్వాసం తో బిజినెస్ పెట్టటం, దాన్లో రాణించటం అన్నీ ఆ దేవదేవుడైన అన్నగారి మహత్యం వల్లనే జరిగాయని మనస్పూర్తిగా నమ్ముతాను. ఆయన ఫోటో ఇంట్లో పూజగదిలో ఉంటుంది. మా పెద్దమ్మాయి పెళ్ళిలో శ్రీకృష్ణ పాండవీయం లోని దుర్యోధన గెటప్ ని 70 అడుగుల కటౌట్ చేయించి పెట్టాను. పెళ్ళికి వచ్చిన షుమారు 3000 మందిలో దాదాపు అందరూ ఆ కటౌట్ ముందు పోజిచ్చి ఫోటో తీయించుకున్నారు.

నాకు చాలా బాగా నచ్చిన అన్నగారి సినిమాలు టాప్ 20 (లెక్కలేనన్ని సార్లు చూసినవి): దానవీరశూర కర్ణ, శ్రీకృష్ణపాండవీయం, చిరంజీవులు, రక్తసంబంధం, పిచ్చిపుల్లయ్య, రాజు – పేద, మల్లీశ్వరి, పాతాళభైరవి, మిస్సమ్మ, గుండమ్మకథ, బండరాముడు, జగదేకవీరుని కథ, జయసింహ, అడవిరాముడు, వేటగాడు, డ్రైవర్ రాముడు, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి, శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మం గారి చరిత్ర, ఉమ్మడికుటుంబం.

వీటి తర్వాతి స్థానం లో (10 సార్లకు పైగా చూసినవి) కొడలుదిద్దిన కాపురం, సీతారామ కళ్యాణం, యమగోల, తిక్కశంకరయ్య, వరకట్నం, గుళేబకావళికథ, కంచుకోట, దేశోద్ధారకులు, దేవుడు చేసిన మనుషులు, మాయాబజార్, ఎదురీత, మగాడు, యుగపురుషుడు, యుగంధర్, కొండవీటిసింహం, ఆరాధన, అన్నదమ్ముల అనుబంధం, లవకుశ, దేవత, గుడిగంటలు.

మహానుభావుడి గురించి ఎంత రాసినా తక్కువే కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను.

జోహార్ ఎన్.టీ.ఆర్. జోహార్ అన్నగారు. జోహార్ పెద్దాయన.

ఈ కథనం 18 జనవరి 2023న facebook లో ప్రచురించబడింది

Related posts