Yadagiri Kutta MRO office lock

యాదగిరి గుట్ట తహసీల్దార్ కార్యాలయానికి తాళం…!?

24

యాద్రాది, భువన గిరి జిల్లా, యాదగిరి గుట్ట తహసీల్దార్ కార్యాలయం ఇప్పుడు తాళం వేసి కన్పిస్తోంది. అయితే అలా తాళం వేసి లోపల సిబ్బంది పనులు నిర్వహిస్తున్నారు. ఇటీవల తెలంగాణా ప్రభుత్వం రోజుకో సంక్షేమ పథకం ప్రకటించి అమలు చేస్తోంది. ఈ పథకాల్లో నూటికి ఎనభై శాతం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో అమలు జరుగుతున్నవే… పథకాలు వస్తునప్పటికీ కొత్తగా ఒక్క సిబ్బంది కూడా నియామకం కాలేదు. దీంతో భారం అంతా ఉన్న సిబ్బందిపైనే పడుతోంది. నిత్యం సర్వేలు, విచారణల పేరుతో సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో కార్యాలయంలో రోజూవారీ పనులకు ఆటంకం కలుగుతోంది. దీన్ని ఆసరాగా తీసుకున్న సిబ్బంది సర్వేలు, విచారణ పేరుతో కార్యాలయాలకు రాకుండా బయట తిరుగుతూ తమ సొంత పనులు చేసుకుంటున్నారు. వచ్చిన వాళ్లు కూడా గంటల వ్యవధిలోనే వెళ్లిపోతున్నారు. దీంతో సిబ్బందితో నిర్బంధంగానైనా పని చేయించాలనుకున్న యాదగిరి గుట్ట తహసీల్దార్ రామకృష్ణ తన సిబ్బందిని కార్యాలయంలో ఉంచి బయట నుంచి గదులకు తాళం వేసి వారితో పనులు చేయిస్తున్నారు.

ప్రస్తుతం విద్యా సంవత్సరం ప్రారంభం అయినందువలన వందల సంఖ్యలో విద్యార్థులు, రైతులు వివిధ రకాల సర్టిఫికెట్స్ కోసం వచ్చి తిరిగి వెళ్లిపోవాల్సి వస్తుంది. దీంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు బంధు చెక్కులు, పాస్ పుస్తకాలలో తప్పులు దొర్లడంతో కొంతమందికి పంపిణీ కాలేదు. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సిబ్బంది అందుబాటులో ఉండకపోవడంతో రైతు బంధు చెక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల కోసం వచ్చిన రైతులు, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు కోసం వచ్చే విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి.
దీనికి తోడు ఈ నెల 20వ తేదీలోగా తప్పులు అన్నీ సవరించి రైతులందరికీ రైతు బంధు చెక్కులు పంపిణీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో కార్యాలయాలకు వచ్చిన ప్రజలకు కార్యాలయ సిబ్బంది అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో తహసీల్దార్ రామకృష్ణ ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఆర్ఐవి, వీఆర్వో, విఆర్ఏ, సీనియర్ అసిస్టెంట్లను కార్యాలయ గదుల్లో ఉంచి తాళం వేసి వారితో పనులు చేయిస్తున్నారు.
యాదగిరి గుట్ట తహసీల్దార్ రామకృష్ణపై అక్కడ వున్న ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైనా అధికారులు ప్రజలకు అందుబాటులో వున్నారని స్థానికులు అంటున్నారు. ప్రభుత్వ సిబ్బంది పని తీరుపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇలా సిబ్బందితో పని చేయిస్తూ ప్రజల అవసరాలను తీర్చడం గురించి అందరూ తహసీల్దార్ ను అభినందిస్తున్నారు.