telugu navyamedia
వార్తలు సామాజిక సినిమా వార్తలు

మాతృభాష పునాదుల మీద ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు: చంద్రబోస్‌

chandrabose writer

మాతృభాష పునాదుల మీద ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చని ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్‌అన్నారు. కృష్ణాజిల్లా చల్లపల్లిలో ఆదివారం స్వచ్ఛ చల్లపల్లి ఐదేళ్ల వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చంద్రబోస్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతృభాషను మరిచిపోవద్దని విజ్ఞప్తి చేశారు. మాతృభాషను మరిచిపోతే భవిష్యత్తు లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తెలుగు భాష తియ్యదనం పాటను ఆలపించారు.

అనంతరం విలేకర్లతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, మానసిక వికాసం మాతృభాషతోనే సాధ్యమన్నారు. పిల్లలకు తల్లి గర్భంలోనే గ్రామర్‌ వస్తుందనీ, మాతృభాషలో అంత గొప్ప లక్షణం ఉందని చెప్పారు. మాతృభాషలో విద్యాబోధన జరిగితే ఆలోచనలు విస్తరిస్తాయన్నారు. అమెరికాలో ఉంటున్న తెలుగువారంతా మాతృభాషలో విద్య అభ్యసించిన వారేనని చెప్పారు. గొప్పస్థాయిలో, స్థితిలో ఉన్నవారందరూ మాతృభాషలో చదువుకున్నవారేనని పేర్కొన్నారు. భాషతోనే సంస్కృతి అలవడుతుందన్నారు. పరభాష కళ్లజోడు లాంటిదని, మాతృభాష కళ్ల వంటిదని అభివర్ణించారు. కళ్లు లేకుండా అద్దాలు పెట్టుకోవటం ఎందుకని అన్నాదురై అనేవారని చంద్రబోస్‌ తెలిపారు.

Related posts