telugu navyamedia
క్రీడలు వార్తలు

ధోని రిటైర్‌ తర్వాతే రెగ్యులర్‌గా ఆడే అవకాశం వచ్చింది…

ఐపీఎల్ 2021 సీజన్ సందర్భంగా కరోనా బారిన పడిన వికెట్‌ కీపర్ వృద్ధిమాన్ సాహా ఈ మధ్యే కోలుకున్నాడు. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ఎంపికయ్యాడు. అయితే ఈ పర్యటనలో అతను యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ పోటీపడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో క్రిక్‌ట్రాకర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాహా ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘బాగా ఆడితే అవకాశాలు వస్తాయని నేను నమ్ముతా. జట్టుకు సమతూకం, కూర్పు అత్యవసరం. అలాంటప్పుడు కొందరికి తుది జట్టులో చోటు దక్కదు. విజయాలు సాధిస్తున్నంత వరకు నేను రిజర్వు బెంచ్‌పై ఉన్నా సంతోషమే. ధోనీ భాయ్‌ జట్టులో ఉంటే అన్ని మ్యాచుల్లో అతడే ఆడతాడని అందరికీ తెలుసు. దొరికిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొనేందుకు నేను సన్నద్ధం అయ్యేవాడిని. 2010లో నా అరంగేట్రం అలాగే జరిగింది. మొదట అవకాశం లేదని ఆ తర్వాత హఠాత్తుగా చోటిచ్చారు. ప్రతి మ్యాచ్‌ ఆడుతానని భావించే సాధన చేస్తాను. 2014 తర్వాత.. ధోని భాయ్‌ రిటైర్‌ అవ్వడంతో… నాకు రెగ్యులర్‌గా ఆడే అవకాశం వచ్చింది.’ అని సాహా తెలిపాడు. అయితే మొత్తం 38 మ్యాచ్‌లాడిన ఈ బెంగాలీ క్రికెటర్‌ 1251 పరుగులు చేశాడు. వికెట్ కీపర్‌గా 103 ఔట్లలో భాగస్వామ్యమయ్యాడు.

Related posts