world blood donar day

“వరల్డ్ బ్లడ్ డోనర్ డే” ప్రాముఖ్యత ఏంటో తెలుసా ?

88

మనిషికి రక్తం ఎంత విలువైనదో ప్రతి ఒక్కరికి తెలుసు. అది మనిషి శరీరంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే రక్తదానం వలన చాలా మంది ప్రాణాలను బ్రతికించవచ్చు. చేసిన దానం సవ్యంగా ఉపయోగిస్తున్నారా ? లేదా దుర్వినియోగం చేస్తున్నారా ? అనే సందేహం రావచ్చు కొందరికి. దుర్వినియోగం అంటే మార్కెట్లో అమ్మకానికి పెట్టడం కూడా కావచ్చు. అయితే రక్తం ప్రాముఖ్యత ఏమిటి ? ఈ “వరల్డ్ బ్లడ్ డోనర్ డే” అంటే ఏంటి ? ఎందుకు జరుపుకుంటున్నాము ?అనే విషయాలు తెలుసుకుందాం.

ప్రతి సంవత్సరం జూన్ 14 న ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు “వరల్డ్ బ్లడ్ డోనర్ డే” (WBDD) జరుపుకుంటాయి. అయితే సంవత్సరం జూన్ 14నే ఎందుకు జరుపుకుంటున్నాము అని ఎవరికైనా సందేహం వచ్చిందా ? అయితే ఎందుకు అనే విషయాన్ని తెలుసుకోవాలని ఎంతమంది ప్రయత్నించారు ? చాలా తక్కువ మందికి ఈ విషయం తెలిసి ఉంటుంది.

Blood-Donation

జూన్ 14నే ఎందుకు “వరల్డ్ బ్లడ్ డోనర్ డే” ?
జూన్ 14న కార్ల్ ల్యాండ్ స్టెయినర్ అనే శాస్త్రవేత్త జయంతి… 1868లో జన్మించిన కార్ల్ ఒక ఆస్ట్రియన్ బయోలాజిస్ట్, వైద్యుడు, మరియు ఇమ్యునాలజిస్ట్. అతను 1900 లో ప్రధాన రక్తం సమూహాలను గుర్తించాడు, రక్తంలో అగ్గ్లుటినిన్ల ఉనికిని గుర్తించడం ద్వారా రక్త సమూహాల వర్గీకరణ యొక్క ఆధునిక వ్యవస్థను అభివృద్ధి చేశాడు. 1937 లో అలెగ్జాండర్ ఎస్. వైనర్, రీసస్ కారకాన్ని గుర్తించాడు. దీనివలన వైద్యులు రోగులను అపాయం పాలు చేయకుండా రక్త మార్పిడి చేయగలిగారు.

కాన్స్టాన్టిన్ లెవాడిటీ మరియు ఎర్విన్ పోపెర్లతో అతను 1909 లో పోలియో వైరస్ను కనుగొన్నాడు. అతను 1926 లో అరోన్సన్ బహుమతిని అందుకున్నాడు. 1930లో, అతను ఫిజియాలజీ లేదా మెడిసిన్ లో నోబెల్ బహుమతిని అందుకున్నాడు. అతనికి మరణానంతరం 1946లో లాస్కర్ అవార్డును కూడా ప్రదానం చేశారు. అంతేకాదు అతనిని “ది ఫాదర్ అఫ్ ట్రాన్స్ ఫ్యూషన్ మెడిసన్”గా వర్ణించారు. కార్ల్ 1943లో 75 సంవత్సరాల వయసులో మరణించారు. ఉన్నంత కాలం ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి పరిశోధనలు చేసి, భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా, జీవన ప్రదాతగా నిలిచారు కార్ల్.

who

“వరల్డ్ బ్లడ్ డోనర్ డే” అంటే ఏమిటి ?
2004 లో స్థాపించబడిన ఈ కార్యక్రమం, సురక్షితమైన రక్తం మరియు రక్త ఉత్పత్తుల అవసరాన్ని గురించి అవగాహన పెంచుతుంది. ఒకరి జీవితాన్ని నిలపడం కోసం తమ రక్తాన్ని దానం చేస్తున్న రక్త దాతలకు అందరం కృతజ్ఞతలు తెలపాలి.

వరల్డ్ బ్లడ్ డోనర్ డే అనేది ప్రపంచంలోని ఎనిమిది ముఖ్యమైన పబ్లిక్ హెల్త్ క్యాంపైన్స్ లలో ఒకటని వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ ప్రకటించింది. వరల్డ్ హెల్త్ డే, వరల్డ్ ట్యూబేర్కలోసిస్ డే, వరల్డ్ ఇమ్మ్యూనిజేషన్, వరల్డ్ మలేరియా డే, వరల్డ్ నో టొబాకో డే, వరల్డ్ హెపటైటిస్ డే, వరల్డ్ ఎయిడ్స్ డేతో పాటు వరల్డ్ బ్లడ్ డోనర్ డే కూడా ఒక ముఖ్యమైన ఆరోగ్యానికి సంబంధిన అంశం.

world blood donar day1రక్తం మార్పిడి వలన ప్రతి సంవత్సరం లక్షల మంది జీవితాలు రక్షింపబడుతున్నాయి. ఇది ప్రాణాంతక పరిస్థితులతో బాధపడుతున్న రోగులను ఎక్కువ కాలం జీవించేలా చేయడానికి సహాయపడుతుంది. క్లిష్టమైన వైద్య మరియు శస్త్రచికిత్సా విధానాలలో, ప్రసూతి సమయాల్లో రోగుల జీవితాలను కాపాడడంలో రక్తం చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ప్రసవ సమయంలో తీవ్రమైన రక్తస్రావం వల్ల జరిగే మరణాలను తగ్గిస్తుంది. చాలా దేశాలలో నాణ్యత గల, సురక్షితమైన రక్తాన్ని పొందడంలో సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తోంది. రక్త దాతలు స్వచ్చందంగా ముందుకు వచ్చి తమ రక్తాన్ని దానం చేసినప్పుడే ప్రపంచంలోని అన్ని దేశాల్లో రక్తం కొరత తగ్గి, చాలా మందికి జీవితాన్ని ప్రసాదిస్తుంది. 2020 సంవత్సరం వరకు అన్ని దేశాల నుంచి ఇంతవరకూ స్వచ్చందంగా తమ రక్తాన్ని దానం చేయని వారి నుండి సరైన అవగాహనా కల్పించి, వారితో రక్త దానాన్ని చేయించి, రక్తం సరఫరా కొరత లేకుండా నివారించడమే లక్ష్యంగా పనిచేస్తోంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్.

world blood donar day3రక్తం అవసరం ఏంటి ?
ఒకరి రక్తాన్ని మరొకరికి ఎక్కించాల్సిన పరిస్థితి ఎప్పుడొస్తుంది ? అంటే మనిషికి ఒక లీటర్ రక్తంలో 100 గ్రాముల కంటే ఎక్కువ హిమోగ్లోబిన్ ఉండాలి. ఎవరికైనా 60 కంటే తక్కువ ఉంటే రక్తాన్ని ఎక్కించాల్సి ఉంటుంది. అంతేకానీ ఆపరేషన్ చేసిన ప్రతిసారీ రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉండదు. మన శరీరంలో మొత్తం 12 యూనిట్ల రక్తం ఉంటుంది. ప్రమాదాలలో దెబ్బలు తగిలి బాగా రక్తం పోయినప్పుడు సర్వసాధారణంగా ఆపరేషన్ చేసి ప్రాణాలను కాపాడుతారు వైద్యులు. ఆపరేషన్ సమయంలో కూడా కొంత రక్తస్రావం జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో కూడా రక్తాన్ని ఎక్కిస్తారు.

world blood donar day

కృత్రిమ రక్తం నాణ్యత ఎలా ఉండాలి ?
ఈరోజుల్లో రక్తదానం చేసే వారి సంఖ్య తగ్గుతోంది. ఇలాంటి సందర్భాల్లో రక్తం కొరత వలన కృత్రిమ రక్తాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఏర్పడుతుంది. కృత్రిమంగా ఏర్పాటు చేసిన రక్తం ఈ లక్షణాలను కలిగి ఉండాలి. అప్పుడే కృత్రిమ రక్తం సురక్షితం అవుతుంది.
* నాన్ టాక్సిక్ అయి ఉండాలి.
*రవాణా చెయ్యడానికి అనుకూలంగా ఉండాలి.
*అందులో రోగకారక పదార్థాలు ఉండకూడదు.
* ఏ బ్లడ్ గగ్రూపుతో అయినా కలిసి పోవాలి.
*గ్రహీత శరీరంలోకి కృత్రిమ రక్తాన్ని ఎక్కించినప్పుడు రక్షక ప్రతిస్పందన (ఇమ్మ్యూన్ రియాక్షన్) రాకూడదు.
* శరీరం సొంత రక్తాన్ని తయారు చేసుకునేంత వరకు పాడవకుండా పని చెయ్యాలి.
* ఆ తరువాత శరీరం నుండి విసర్జింపబడాలి.
* షెల్ఫ్ లైఫ్ ఎక్కువ కాలం ఉండాలి.
* ఇంతవరకూ ఇలాంటి లక్షణాలున్న కృత్రిమ రక్తాన్ని తయారు చేసే పదార్థం దొరకలేదు.

world blood donar day4

ఈ “వరల్డ్ బ్లడ్ డోనర్ డే” ద్వారా ప్రజలకు అవగాహన కల్పించి, రక్తం కొరతను తగ్గించి మరింతమంది ప్రాణాలను కాపాడేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కృషి చేస్తోంది. ఈ సందర్భంగానే జూన్ 14 రక్తం ప్రాముఖ్యతను తెలిపిన, దానికోసం తీవ్రంగా కృషి చేసిన కార్ల్ జయంతి సందర్భంగా “వరల్డ్ బ్లడ్ డోనర్ డే”ను ప్రకటించారు. కాబట్టి యువత తమ రక్తాన్ని దానం చేసి ప్రాణాలను నిలపడంతో సహాయపడండి. హ్యాపీ వరల్డ్ బ్లడ్ డోనర్ డే….!

 

-విమలత