యూఎస్‌లోని నెబ్రాస్కా రాష్ట్ర రాజధాని లింకన్‌లో 19 ఏళ్ల యువతి చేసిన పనికి సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. చాలా కాలంగా ఓ యువకుడిని ప్రేమించిన యువతి ఇటీవలె విడిపోయింది. ప్రియుడితో మనస్పర్థల కారణంగా అతడికి దూరంగా ఉంటుందా యువతి. ఈ క్రమంలో ఒకరోజు ప్రియుడు ఇచ్చిన ప్రేమ లేఖలు ఆమె కంటబడ్డాయి. వాటిని చూసిన యువతికి ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది. దాంతో వెంటనే వాటన్నింటినీ తన బెడ్‌రూంలోనే నేలపై పడేసి మంట పెట్టి అక్కడి నుంచి వేరే గదికి వెళ్లిపోయింది.అంతే.. క్షణాల్లో బెడ్‌రూం మొత్తం మంటలు అంటుకున్నాయి. ఆమె లెటర్లకు మంట పెట్టిన చోట పక్కనే కార్పెట్ ఉండడంతో దానికి మంటలు అంటుకొని గది మొత్తం వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ప్రమాదాస్థలికి చేరుకొని నిమిషాల వ్యవధిలోనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో అక్కడి వారు ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఈ ఘటన వల్ల భవనానికి 4వేల డాలర్ల(రూ. 2లక్షల 85వేలు) నష్టం వాటిల్లిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. కాని యువతి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని పోలీసులు తెలిపారు.
previous post