telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

అమ్మాయిని అపహరించిన మాజీ ప్రియుడు… పట్టించిన పక్కింటి డోర్ బెల్ కెమెరా

Girl

పక్కింటి వారి డోర్‌బెల్ కెమెరాలో రికార్డైన దృశ్యాలు ఓ యువతి ప్రాణాలు కాపాడిన ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి ఓ వ్యక్తి తన మాజీ ప్రియురాలిని బయటి నుంచి తరుముకుంటూ వచ్చి ఆమె ఇంటి ముందు నుండి జట్టు పట్టి ఈడ్చుకెళ్లిన దృశ్యాలు పక్కింటి వారి డోర్‌బెల్ కెమెరాలో రికార్డు కావడంతో పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. రాబర్ట్ మైఖేల్ మెండెజ్ (27) అనే వ్యక్తి నుంచి బాధితురాలిని కాపాడడంతో పొరుగింటి డోర్‌బెల్‌లో రికార్డైన దృశ్యాలు తమకు ఉపయోగపడ్డాయని పోలీసులు తెలిపారు. ఆ ఫుటేజీ ఆధారంగా ఘటన జరిగిన తరువాతి రోజు రాబర్ట్‌ను అదుపులోకి తీసుకుని అతడి వద్ద బందీగా ఉన్న బాధితురాలిని పోలీసులు కాపాడారు. వీడియోలోని దృశ్యాల ఆధారంగా… బాధితురాలిని బయటి నుంచి తరుముకుంటూ వచ్చి ఆమె ఇంటి ముందు నుండి జట్టు పట్టి రాబర్ట్ ఈడ్చుకెళ్లడం వీడియోలో ఉంది. అది చూసిన ఇంటి యజమానులు 911కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారంతో వెంటనే ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు చుట్టుపక్కల మొత్తం వెతికిన రాబర్ట్ ఆచూకీ మాత్రం తెలియలేదు. అయితే, తరువాతి రోజు అదే ప్రాంతానికి వచ్చాడు రాబర్ట్. అతడ్ని గుర్తుపట్టిన ఘటన జరిగిన ప్రాంతంలోని స్థానికుల్లో ఒకరు పోలీసులకు ఫోన్ చేసి యువతిని అపహరించి తీసుకెళ్లిన వ్యక్తి తన ఎదుటే ఉన్నాడని సమాచారం అందించాడు. అతడి సమాచారంతో వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు రాబర్ట్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో యువతిని ఎక్కడ దాచిపెట్టాడో చెప్పేశాడు. దాంతో పోలీసులు అతడు చెప్పిన చోటుకు వెళ్లి యువతిని తీసుకొచ్చారు. అనంతరం స్వల్పంగా గాయపడిన ఆమెను చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. రాబర్ట్‌పై హత్యాయత్నం, కిడ్నాప్ కింద కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో నెట్టింట వైరల్‌గా మారింది.

Related posts