telugu navyamedia
తెలంగాణ వార్తలు

కాన్పు స‌మ‌యంలో క‌డుపులో దూది మరచిపోయిన వైద్యలు.. మహిళ మృతి

వైద్యుల నిర్ల‌క్ష్యం ఓ మ‌హిళ నిండు ప్రాణాల‌ను బ‌లిగొన్న‌ది. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా రాయ‌గిరి గ్రామానికి చెందిన ఓ గ‌ర్భిణి కాన్పు నిమిత్తం.. ఏడాది క్రితం భువ‌న‌గిరి కేకే ఆస్ప‌త్రిలో చేరింది. దీంతో ఆమెకు వైద్యులు స‌ర్జ‌రీ నిర్వ‌హించి డెలివ‌రీ చేశారు. ప్ర‌స‌వం త‌ర్వాత స‌ద‌రు మ‌హిళ క‌డుపునొప్పితో బాధ‌ప‌డింది. క్ర‌మ‌క్ర‌మంగా ఆమె తీవ్ర‌మైన క‌డుపునొప్పితో బాధ‌ప‌డుతుండ‌టంతో.. ఇటీవ‌లే చికిత్స కోసం హైద‌రాబాద్‌లోని ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రికి కుటుంబ స‌భ్యులు తీసుకొచ్చారు. వైద్యులు ఆమెకు అన్ని ర‌కాల మెడిక‌ల్ టెస్టులు నిర్వ‌హించ‌గా, క‌డుపులో దూది ఉన్న‌ట్లు గుర్తించారు.

తొలికాన్పు స‌మ‌యంలో ఆమె కడుపులో దూది అలానే ఉంచి, మ‌రిచిపోయి కుట్లు వేశారు. ఆ దూది అలాగే ఉండ‌టంతో పేగులు దెబ్బ‌తిని తీవ్ర‌మైన క‌డుపునొప్పికి కార‌ణ‌మైంది. హైద‌రాబాద్‌లోని ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో బాధిత మ‌హిళ‌ చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో ఆమెకు తొలి కాన్పు చేసిన భువ‌న‌గిరి కేకే ఆస్ప‌త్రి ఎదుట మృత‌దేహంతో కుటుంబ స‌భ్యులు, బంధువులు ఆందోళ‌న‌కు దిగారు. మ‌హిళ మృతికి ఆస్ప‌త్రి వైద్యుల నిర్లక్ష్య‌మే కార‌ణ‌మ‌ని ఆగ్రహాం వ్యక్తం చేశారు.

Related posts