పబ్‌జీ వచ్చాక చిన్నపెద్దా తారతమ్యం లేకుండా అందరూ ఈ గేమ్‌లో మునిగిపోతున్నారు. ఎంతలా అంటే ఆ గేమ్ తప్ప వేరే ఏ పనీ చేయనంతగా. అందుకే కొన్ని దేశాలు ఈ గేమ్‌పై నిషేధం కూడా విధించాయి. ఇటీవల యూఏఈలోని అజ్మన్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. 20 ఏళ్ల ఓ యువతి అజ్మన్ పోలీసుల శాఖకు చెందిన సోషల్ సెంటర్‌కు వెళ్లి.. ‘నన్ను నా భర్త పబ్‌జీ గేమ్ ఆడుకోనివ్వడం లేదు. మాకు విడాకులు ఇప్పించండి’ అని కోరింది. దీంతో ఖంగుతిన్న అధికారులు ఆమెను కూర్చొబెట్టి, ఆమె భర్తను పిలిపించి మాట్లాడారు. తన స్వేచ్ఛను భర్త హరిస్తున్నాడని ఆమె అంటుండగా.. ఆమె కుటుంబ బాధ్యతలను సరిగా నిర్వర్తించాలనే ఉద్దేశంతోనే తాను అలా చేశానని భర్త సమాధానం ఇచ్చాడు. వీరిద్దరికీ సర్ది చెప్పేసరికి పోలీసుల తల ప్రాణం తోకకు వచ్చింది. ఇలానే మరో తల్లి కూడా తన 13 ఏళ్ల కొడుకు పబ్‌జీ గేమ్‌కు బానిసయ్యాడని సోషల్ సెంటర్‌ను సంప్రదించింది. ఆ గేమ్ ఆడకుండా లాక్ చేయడంతో ఆ కుర్రాడు తీవ్రమైన మానసిక క్షోభకు గురై మంచాన పడ్డాడని అధికారులు చెప్పారు. ఇలా ఓ గేమ్ వల్ల తమకు ఇన్ని తలనొప్పులు రావడం ఇదే తొలిసారంటూ తలలు పట్టుకుంటున్నారు.
previous post