భార్య చేతిలో భర్త దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పలమనేరు మండలంలోని నక్కలపల్లికి చెందిన గోపీనాథ్‌రెడ్డి (36) అదే గ్రామానికి చెందిన అత్త కూతురు సునీత (32)ను 13 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి 9 ఏళ్ల కుమారుడున్నాడు. కొన్నేళ్ల క్రితం గోపీనాథ్‌రెడ్డి బెంగళూరు వెళ్లి క్యాబ్ నడుపుకుంటూ జీవిస్తున్నాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో నాలుగు నెలల క్రితం గ్రామానికి వచ్చిన గోపీనాథ్ అత్తగారింట్లో ఉంటున్నాడు.
చేతిలో డబ్బులు లేక వాయిదాలు చెల్లించకపోవడంతో ఫైనాన్స్ కంపెనీ అతడి కారును తీసుకెళ్లిపోయింది. దీంతో ఉపాధి కోసం ట్రాక్టర్ కొనుక్కోవాలని గోపీనాథ్ భావించాడు. అందుకోసం నగలు ఇవ్వాలని భార్యను అడిగాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన భార్య క్రికెట్ బ్యాట్ తో అతడిపై దాడిచేసి హతమార్చారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.