telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

నరేంద్ర మోదీ బాబును ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాడు ?

why modi targeting apcm

ఇప్పుడు మోడీ దృష్టి ఎక్కువ చంద్ర బాబు లేదా ఆయన కుమారుడు మీదనే ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడును ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? ఎందుకు బాబు అవినీతిపరుడని మోడీ విమర్శలు గుప్పిస్తున్నారు ? ఆంధ్ర ప్రదేశ్ లో ప్రధాని పర్యటన చేసినప్పుడల్లా చంద్రబాబు పైనే ఎక్కువ సమయం కేటాయించి బాబుకి నీతి, రీతి లేదని ధ్వజమెత్తుతున్నారు ? ఆ మధ్య గుంటూరు సభలో కూడా చంద్ర బాబు ఆయన కుమారుడు లోకేష్ మీదనే మోడీ తీవ్రమైన విమర్శలు గుప్పించాడు. అవకాశం ఉన్నప్పుడల్లా చంద్ర బాబును వదిలిపెట్టడం లేదు. నిన్న వైజాగ్ లో జరిగిన సభలో అరగంటకు పైగా మాట్లాడిన మోడీ ఎక్కువ సమయం చంద్ర బాబు అవినీతి పాలన, అసమర్ధత గురించి విమర్శించాడు.

ముందు తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోడీ వైజాగ్ లోని ప్రముఖులను స్మరించాడు. ఇక అక్కడ నుంచి పరోక్షంగా చంద్ర బాబు పాలన మీదనే మోడీ ఉపన్యాసం సాగింది. చంద్రబాబు మోడీతో విభేదించి భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత ఇద్దరి మధ్య దూరం పెరిగింది. కాంగ్రెస్ పార్టీ తో బాబు కలసి పనిచెయ్యడం, దేశంలోని ప్రతి పక్ష పార్టీలను ఏకం చేయడంతో రాజకీయంగా ఇద్దరి మధ్య వైరం పెరుగుతూ వస్తోంది. మోడీని దించెయ్యాలన్న లక్ష్యంతో బాబు పనిచేస్తున్నాడు. తరచుగా ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీతో సమావేశమవుతున్నాడు.

పశ్చిమ బెంగాల్ ముఖమంత్రి మమతా బెనర్జీతో సమాలోచనలు చేస్తున్నాడు. ఇవ్వన్నీ నరేంద్ర మోడీని నచ్చడంలేదు, అస్సలు మింగుడుపడటం లేదు. వచ్చే ఎన్నికల్లో దక్షిణ భాధ దేశం నుంచి ఎక్కువ సీట్లు వచ్చేలా మిత్ర పక్షాలతో కలసి వ్యూహ రచన చేస్తున్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు, వై ఎస్ ఆర్ సి.పి. నాయకుడు జగన్ మోహన్ రెడ్డి తో కలసి చంద్రబాబు నాయుడును ఓడించాలని స్కెచ్ కూడా తయారయ్యింది అంటున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు పై ఎక్కువ ద్రుష్టి పెట్టాడు.
why modi targeting apcm
ఈ సభలో మోడీ, చంద్రబాబు యూ టర్న్ తీసుకోవడంలో ముందు వరసలో ఉంటాడని, అతని అవినీతిని కప్పి పుచ్చుకోవడానికి కూటమి అంటూ తిరుగుతున్నాడని ఘాటుగా స్పందించాడు. దేశంలో సుస్థిరమైన పాలన వున్నప్పుడే పాకిస్తాన్ లాంటి శత్రువును ఎదుర్కోగలమని అందుకే పరోక్షంగా తనని గెలిపించాల్చిన అవసరం ఉందని చెప్పాడు. చంద్రబాబు చిన్నా చితకా పార్టీలతో జత కట్టి దేశాన్ని అస్థిరపరచాలని చూస్తున్నాడని ఘాటుగానే దుయ్య బట్టాడు. తనను కుర్చీ నుంచి దించేయాలని చంద్ర బాబు చూస్తున్నాడని మనసులోని మాట చెప్పాడు.

నిజంగానే మోడీ చంద్ర బాబుకు భయపడుతున్నాడా ? విశాఖ సభకు భారీగా తరలి వచ్చారు. ప్రధాని ఉపన్యాసాన్ని దగ్గుబాటి పురందేశ్వరి తెలుగులోకి అనువదించడం ఆసక్తిని కలిగించింది. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎలాగైనా ఎన్నికలలో మోడీని ఓడించాలనే ఉద్దేశ్యంతో అలుపెరుగకుండా పనిచేస్తున్నాడు. దేశంలో ఇప్పుడున్న పరిస్థితులు, మారిన రాజకీయ స్థితిగతులు చంద్రబాబు లక్ష్యాన్ని నెరవేర్చగలవా ? మోడీ వ్యూహం ఫలిస్తుందా ?

-భగీరథ

Related posts