కరోనా వైరస్ ప్రస్తుతం భూగోళాన్ని చుట్టుముట్టింది. ఖండాలను దాటుకుంది. ఆసియా, దక్షిణ అమెరికా, ఐరోపా ఖండాల్లోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లోనూ కరోనా వైరస్ జాడ కనిపిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అంతర్జాతీయ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. అన్ని దేశాలు కూడా కరోనా వైరస్‌ను నియంత్రించడానికి తక్షణ చర్యలను చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది. కరోనా వైరస్ కోరలు చాస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని అడ్డుకట్ట వేయడానికి చేపట్టాల్సిన చర్యలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సమావేశమైంది. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఏర్పాటైన ఈ సమావేశానికి డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథెనమ్ అధ్యక్షత వహించారు. పలు అంశాలపై చర్చించారు. కరోనా వైరస్ పుట్టుకొచ్చిన తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్థ తొలిసారిగా సమావేశం కావడం ఇదే తొలిసారి కావడంతో ప్రాధాన్యత ఏర్పడింది.
అనంతరం టెడ్రోస్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరోనా వైరస్ విస్తరిస్తోన్న తీరు అత్యంత ప్రమాదకరంగా ఉందని వ్యాఖ్యానించారు. దీన్ని నియంత్రించడానికి తక్షణ చర్యలను చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. చైనాకు వెళ్లే ప్రయాణికులు, సందర్శకుల కోసం తాము ఎలాంటి ట్రావెల్ అడ్వైజరీని ప్రకటించట్లేదని టెడ్రోస్ తెలిపారు. ఇదివరకు ఎప్పుడూ చూడని వైరస్‌గా టెడ్రోస్ దీన్ని అభివర్ణించారు. ఈ వైరస్ విస్తరిస్తోన్న తీరు అనేక సవాళ్లను విసురుతోందని చెప్పారు. చైనాలో ఆరోగ్య పరిస్థితులు బలహీనంగా ఉన్నాయనే విషయాన్ని ఈ వైరస్ స్పష్టం చేసిందని అన్నారు. అలాగని తాము.. చైనాపై ఎలాంటి నిషేధాజ్ఙలు గానీ, ఆంక్షలు గానీ విధించట్లేదని చెప్పారు. ఈ సమావేశం సందర్భంగా తాము చైనాకు అనుకూలంగా ఓటు వేశామనీ పేర్కొన్నారు.
అత్యంత ప్రమాదకరంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్‌ను నియంత్రించడానికి ప్రపంచ దేశాలు ఉమ్మడిగా కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయాల్సి ఉందని, దీనికోసం తాము కొన్ని మార్గదర్శకాలను రూపొందించామని టెడ్రోస్ వెల్లడించారు. అన్ని దేశాలు తమ భౌగోళిక పరిస్థితులు, వాతావరణం, కాలుష్యం.. వంటి పరిస్థితులకు అనుగుణంగా వాటిని అమలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఉమ్మడిగా ఎదుర్కొనడం ద్వారానే ఈ వైరస్‌ను నియంత్రించగలుగుతామని అన్నారు. చైనాను మినహాయిస్తే.. మిగిలిన దేశాల్లో మొత్తం 98 కరోనా వైరస్ కేసులు నమోదైనట్లు తమ దృష్టికి వచ్చిందని టెడ్రోస్ వెల్లడించారు. తాజాగా అమెరికా సహా జర్మనీ, జపాన్, వియత్నాంలల్లో ఎనిమిది కేసులు నమోదయ్యాయని, ఈ ఎనిమిది మనుషుల నుంచి మనుషులకు సోకినట్టుగా తేలిందని అన్నారు. మరిన్ని కేసులను ధృవీకరించాల్సి ఉందని, దీనికి సంబంధించిన నివేదికలు అందిన తరువాతే ఈ విషయం స్పష్టమౌతుందని అన్నారు.