ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు తక్షణం ప్రపంచ దేశాలన్నీ చర్యలు చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సూచించింది. లేనిపక్షంలో దాదాపు 20 లక్షల మంది వరకూ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వెంటనే కరోనాపై అన్ని దేశాలూ యుద్ధం ప్రకటించాలని సూచించింది.
ఈ మహమ్మారి తొలిసారిగా చైనాలోని వూహాన్ లో వెలుగు చూడగా, ఆపై 9 నెలల వ్యవధిలోనే 10 లక్షల మంది వరకూ కన్నుమూసిన సంగతి తెలిసిందే.ఈ పరిస్థితి చాలా ఆందోళనకరమని, కేవలం ప్రభుత్వాలు మాత్రమే చర్యలు చేపడితే సరిపోదని తెలిపారు. ప్రజలు సైతం తమతమ స్థాయిలో వైరస్ ను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ డైరెక్టర్ మైకేల్ ర్యాన్ అన్నారు. ఈ వైరస్ తగ్గుముఖం పడుతుందన్న సూచనలు ఇంతవరకూ కనిపించలేదని పేర్కొన్నారు.