telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

హనుమంతుడి జన్మస్థానంగా తిరుమల ?

హిందువుల ఆరాధ్యదైవం, కలియుగ వైకుంఠం తిరుమల…హనుమంతుడి జన్మస్థానంగా గుర్తింపు పొందనుంది. ఈ నెల 13న తెలుగు సంవత్సరం ఉగాది పండుగ పర్వదినాన…పురాణాలు, శాసనాలు, శాస్త్రీయ ఆధారాలతో నిరూపించేందుకు రెడీ అయింది టీటీడీ. హ‌నుమంతుని జ‌న్మస్థానం అంజనాద్రి అని నిరూపించేందుకు ఉన్న ఆధారాలు, ఇత‌ర వివ‌రాల‌తో…త్వర‌లో స‌మ‌గ్రమైన పుస్తకాన్ని తీసుకురావాల‌ని నిర్ణయించారు. దీనిపై ఈవో కేఎస్‌ జవహర్‌రెడ్డి…సమీక్ష నిర్వహించారు. అంజ‌నాద్రి కొండ‌లో హ‌నుమంతుడు జ‌న్మించాడ‌నే విష‌యాన్ని ఆధారాల‌తో నిరూపించేందుకు…2020 డిసెంబ‌రులో టిటిడి పండితుల‌తో కమిటీ ఏర్పాటు చేసింది. ఎస్వీ వేద విశ్వవిద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి ఆచార్య స‌న్నిధానం సుదర్శన‌ శ‌ర్మ, జాతీయ సంస్కృత విశ్వవిద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి ఆచార్య ముర‌ళీధ‌ర శ‌ర్మ, ఇస్రో శాస్త్రవేత్త శ్రీ రేమెళ్ల మూర్తి, రాష్ట్ర పురావ‌స్తు శాఖ డెప్యూటీ డైరెక్టర్ విజ‌య్‌కుమార్ స‌భ్యులుగా ఉన్నారు. పండితులు ప‌లు మార్లు స‌మావేశాలు నిర్వహించారు. లోతుగా ప‌రిశోధ‌న చేసి హ‌నుమంతుడు అంజ‌నాద్రిలోనే జ‌న్మించాడ‌ని రుజువు చేసేందుకు బ‌ల‌మైన ఆధారాలు సేక‌రించారు. వివిధ పురాణాలు, వేంక‌టాచ‌ల మ‌హ‌త్యం, వ‌రాహ‌మిహిరుని బృహ‌త్‌సంహిత గ్రంథాల ప్రకారం… వెంకటశ్వేరుడి చెంత ఉన్న అంజ‌నాద్రి కొండే ఆంజ‌నేయుని జ‌న్మస్థాన‌మ‌ని యుగం ప్రకారం, తేదీ ప్రకారం నిర్ధారించారు.

Related posts