ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో వాట్సాప్తో జనన, మరణ ధృవీకరణ పత్రాలు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది.
మొదట తెనాలిలో దీనిని ప్రయోగాత్మకంగా చేపట్టి పరిశీలించాలని నిర్ణయించింది. ఆ తర్వాత, దీనిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వెల్లడించారు.
అమరావతిలో విజయానంద్ అధ్యక్షతన వాట్సాప్ గవర్నెన్స్, ఏపీ సీఆర్ఎస్ అమలుపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకోవాలని, రియల్‌టైమ్ లో సమాచారాన్ని సేకరించాలని సీఎం చంద్రబాబు గతంలోనే ఆదేశించారు.
సమర్ధవంతమైన పాలన అందించేలా అన్ని శాఖల సమాచారాన్ని ఆర్టీజీఎస్ సమీకృతం చేసి, మొత్తంగా పర్యవేక్షించాల్సి ఉంటుందని కూడా బాధ్యతలు ఫిక్స్ చేశారు.
మొదట ప్రతిశాఖలో సమాచార సేకరణ జరగాలని, తర్వాత ఆ సమాచారాన్ని సమీకృతం చేసుకోవాలని అంతిమంగా ‘వాట్సప్ గవర్నెన్స్’ ద్వారా అత్యుత్తమ సేవలు అందించాలని సీఎం నిర్దేశించారు.
ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత సరళతరం చేయాలనేది కూటమి ప్రభుత్వ ఆలోచన అందులో భాగంగా వాట్సప్ గవర్నెన్స్ ద్వారా 150 రకాల సేవలు అందించాలనేది టార్గెట్గా పెట్టుకుంది.
ఇప్పటికే ప్రభుత్వ ఆఫీసుల్లో అన్నీ కంప్యూటరైజ్డ్ చేసి పేపర్ లెస్ వర్క్ ప్రారంభించిన కూటమి ప్రభుత్వం ఇక వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు పౌర సేవలు మరింత చేరువ చేయాలని చూస్తుంది.