ప్రభుత్వం మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారుడు శంకర్ ఆచార్య నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్యానెల్ ఆర్థిక సంవత్సరాన్ని జనవరి నుంచి డిసెంబర్ కు మార్చాలని సిఫారసు చేసింది. ప్రభుత్వం ఈ కమిటిని ఈ ఏడాది జులైలో ఏర్పాటు చేసింది. ఆర్థికమంత్రిత్వశాఖ ఈ కమిటి నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి ఇటీవలే అప్పగించింది. నీతి ఆయోగ్ చేసిన సూచనల ప్రకారం ‘ఆర్థిక సంవత్సరం కేలండర్ ‘ ను మార్చాలన్న ప్రతిపాదనను కూడా ప్యానెల్ అధ్యయనం చేసింది. ఆర్థిక సంవత్సరం మార్చడం వల్ల కలిగే లాభనష్టాలను జాబితాను కూడా వివరించింది. వాస్తవానికి ఆర్థిక సంవత్సరం ముందుకు జరపడానికి దారి తీసిన కారణాల విషయానికి వస్తే ముఖ్యంగా వ్యవసాయరంగాన్ని,ఋతుపవనాలను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక సంవత్సరాన్ని ముందుకు జరపడానికి ప్రభుత్వానికి సిఫారసు చేశామని చెప్పారు.
ఆర్థిక సంవత్సరం ముందుకు జరపడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా నివేదికలో పొందుపర్చామని శంకర్ ఆచార్య తెలియజేశారు. ఆర్థిక సంవత్సరం ముందుకు జరపడానికి దారితీసిన కారణాలు ఇలా ఉన్నాయి. కేలండర్ ప్రకారం చూస్తే సంవాత్ తర్వాత స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ మొదలవుతాయి. వ్యవసాయరంగానికి వస్తే పంటలు జులై తర్వాత నుంచి మొదలవుతాయి. రబీ – ఖరీఫ్ పంటలు విషయానికి వస్తే శీతాకాలం-వేసవి కాలం పంటల తరుణం. కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకొని ఆర్థిక సంవత్సరాన్ని జనవరి నుంచి డిసెంబర్ గా నిర్ణయించినట్లు ఆయన వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 156 అంతకంటే ఎక్కువ దేశాలు, మరియు బహుళ జాతి కంపెనీలు కూడా కేలండర్ సంవత్సరాన్ని తమ ఆర్థిక సంవత్సరంగా పాటిస్తాయని చెప్పారు. కేలండర్ సంవత్సరాన్ని ఆర్థిక సంవత్సరంగా మారిస్తే సమతులంగా ఉంటుందని శంకర్ ఆచార్య పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్యానెల్ లో శంకర్ ఆచార్యతో పాటు ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్‌లలో విద్యనభ్యసించిన ఆర్థికవేత్తలు ఉన్నారు. మాజీ కేబినెట్ సెక్రెటరీ కెఎం చంద్రశేఖర్, మాజీ తమిళనాడు ఆర్థిక కార్యదర్శి పీవీ రాజారామన్, రాజీవ్ కుమార్, సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చి సీనియర్ ఫెల్లో కూడా ఉన్నారు.
అనుకూల అంశాలు : వ్యవసాయంపై ఆధారపడిన మనదేశ స్థూలదేశీయోత్పత్తి (జీడీపీ)లో 15శాతం వ్యవసాయరంగం నుంచే వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో 58శాతం మంది వ్యవసాయరంగం పై వచ్చే ఆదాయంపై ఆధారపడుతున్నందు వల్ల ఆర్థిక సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్‌కు మార్చడం సబబేనని వ్యవసాయ రంగానికి చెందిన ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఒక వేళ కరువు లాంటి పరిస్థితి ఏర్పడితే సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్‌లో కరువు పరిస్థితులు నెలకొంటాయి. ఆర్థిక సంవత్సరాన్ని జనవరి నుంచి డిసెంబర్ కు మార్చితే బడ్జెట్ లో కేటాయింపులు పెంచుకోవచ్చునని ఆయన అన్నారు. ఒక వేళ కేంద్రబడ్జెట్ నవంబర్ లో ప్రవేశపెడితే వ్యవసాయ రంగానికి రైతులకు ముందుగానే పెద్దమొత్తంలో కేటాయింపులు చేయవచ్చునని వ్యవసాయరంగానికి చెందిన ఆర్థికవేత్త అశోక్ గులాటి వివరించి ఈ ప్రతిపాదనకు మద్దతు ప్రకటించారు.
ప్రతికూలం ఎందుకంటే : మాజీ ప్రధాన గణాంక శాస్త్రవేత్త ప్రోనబ్ సేన్ మాత్రం పెద్ద సంతృప్తికరంగా లేరు. ఆర్థిక సంవత్సరాన్ని జనవరి నుంచి డిసెంబర్‌కు మార్చడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండ దని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం చేయాల్సిందల్లా సరైన సమయంలో కేటాయింపులు జరపాలని..నిర్మాణరంగానికి ఇబ్బంది కలుగకుండా చూడాలన్నారు. వర్షాకాలం లో నిర్మాణ రంగం మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఈ ప్యానెల్ సిఫారసులను అమలు చేస్తే బడ్జెట్ తేదీని మరోసారి మార్పు చేయాల్సి వస్తుంది. ఒక వేళ ఆర్థిక సంవత్సరాన్ని జనవరి – డిసెంబర్‌కు మారిస్తే, బడ్జెట్‌ను నవంబర్ లో ప్రవేశపెట్టాలి. పార్లమెంటు సమావేశాలను తేదీలను మార్చాల్సి ఉంటుంది. రాష్ట్రప్రభుత్వాల నుంచి సమాచార సేకరణలో కూడా మార్పులు చేయాల్సి ఉంటుందన్నారు. చార్టర్డ్ అకౌంటెంట్లు మాత్రం ఆర్థిక సంవత్సరాన్ని ముందుకు జరిపినందు వల్ల సామాన్యుడికి ఒరిగేదేమీ లేదంటున్నారు. పన్ను మదింపు కాలాన్ని ప్రస్తుతం ఏప్రిల్ నుంచి మార్చి కాలానికి మదింపు చేస్తున్నాం. అదే 12 నెలల కాలాన్ని జనవరి నుంచి డిసెంబర్‌కు మార్చాల్సి వస్తుందని వారు చెబుతున్నారు. కెపీఎంజీ ఇండియా పన్ను విభాగం హెడ్ గిరీశ్ వన్వారి మాత్రం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, ఆర్థిక సంవత్సరం, పన్ను మదింపు సంవత్సరం ఒక్కటి గానే ఉంటుంది కాబట్టి సామాన్యుడిపై ఎలాంటి ప్రభావం చూపదని అన్నారు.