ఐపీఎల్ చరిత్రలో ఏ సీజన్‌లోనూ జరగని అత్యద్భుతం ఆదివారం చోటు చేసుకుంది. ఒకే రోజు రెండు ఐపీఎల్ మ్యాచ్‌లు ‘సూపర్ ఓవర్’కు దారి తీశాయి. తొలుత అబుదాబి వేదికగా జరిగిన ‘సూపర్’ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓడించగా… దుబాయ్ వేదికగా ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ విజేత కూడా ‘సూపర్ ఓవర్’లోనే తేలింది. అయితే ఈ మ్యాచ్ ఫలితం తేలడానికి మాత్రం ఒక సూపర్ ఓవర్ కాకుండా రెండు సూపర్ ఓవర్లు ఆడాల్సి వచ్చింది.
గతంలో సూపర్ ఓవర్‌లోనూ రెండు జట్ల స్కోర్లు సమమైతే ఎక్కువ బౌండరీలు సాధించిన జట్టును విజేతగా ప్రకటించేవారు. గతేడాది న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ‘సూపర్ ఓవర్’ కూడా టై కావడం… ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించడం జరిగింది. అయితే ఈ ఫలితంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. దాంతో సూపర్ ఓవర్‌లోనూ స్కోర్లు సమమైతే ఏదో ఒక జట్టు గెలిచేవరకు సూపర్ ఓవర్‌ను ఆడించాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిబంధన తెచ్చింది. ఐపీఎల్‌లో ఆదివారం ఈ నిబంధనను అమలు చేశారు. అయితే రెండో సూపర్ ఓవర్ కూడా టై అయితే ఏం చేసేవారనే సందేహం అందరికి తట్టింది. ఓవైపు ఐసీసీ ఫలితం తేలేవరకు అని చెప్పినా.. ఐపీఎల్ టైమింగ్స్ నిబంధనల ప్రకారం ఇద్దరు కెప్టెన్ల అంగీకారం మేరకు చెరొక పాయింట్ ఇచ్చేవారు. టైమింగ్స్ రూల్ ప్రకారం నైట్ మ్యాచ్‌లో సూపర్ ఓవర్ అర్ధరాత్రి 12 గంటల ముందే ప్రారంభం కావాలి. మధ్యాహ్నం ప్రారంభమయ్యే మ్యాచ్‌లో మాత్రం రాత్రి 8 గంటల్లోపే సూపర్ ఓవర్ మొదలవ్వాలి.
కింగ్స్ పంజాబ్ – ముంబై మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్ సూపర్ ఓవర్ 11.29కి ప్రారంభమై 11.46కు ముగిస్తే.. సెకండ్ సూపర్ ఓవర్ మాత్రం కటాఫ్ టైమ్ 12కు సరిగ్గా 5 నిమిషాల ముందు11.55కు ప్రారంభమై 12.12కు ముగిసింది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన సూపర్ ఓవర్7.39కి మొదలై 7.49కు పూర్తయింది. ఇక బౌండరీల నిబంధనను అమలు చేస్తే మాత్రం ముంబైనే విజయం వరించేది. ఎందుకంటే రోహిత్ సేన 24 బౌండరీలు సాధించగా.. పంజాబ్ 22 బౌండరీలు మాత్రమే కొట్టింది.