telugu navyamedia
రాజకీయ

పశ్చిమ బెంగాల్ లో ముదురుతున్న రాజకీయ తుఫాను!

satyagraha by mamata continues
కేంద్రానికి, పశ్చిమ బెంగాల్ సర్కార్ మధ్య రేగిన రాజకీయ తుఫాను మరింత ముదురుతున్నది. చిట్‌ఫండ్ కుంభకోణాల కేసుల్లో కోల్‌కతా పోలీస్ కమిషనర్ ఇంటిపై సీబీఐ అధికారుల దాడిని నిరసిస్తూ సీఎం మమతా బెనర్జీ నగరంలోని మెట్రో సినిమా ఎదుట చేపట్టిన నిరవధిక దీక్ష మూడో  రోజుకు చేరింది. ఆదివారం మొదలైన ప్రకంపనల ప్రభావం న్యూఢిల్లీతోపాటు పలు రాష్ర్టాల రాజధానుల్లోనూ కనిపించింది. లోక్‌సభ ఎన్నికల ముంగిట కేంద్రా న్ని ఢీకొడుతూ మమత చేపట్టిన ఆందోళనకు పలు వర్గాల పూర్తిమద్దతు లభిస్తున్నది. 
మమత దీక్షకు మద్దతుగా పలు ప్రతిపక్ష పార్టీలు ముక్తకంఠంతో కేంద్రంపై విరుచుకుపడటంతో మంగళవారం పార్లమెంటు ఉభయసభలు వాయిదాపడ్డాయి. మరోవైపు పలుచోట్ల తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో కోల్‌కతా నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడేందుకు తాను చేపట్టిన దీక్ష ఈ నెల 8వరకు కొనసాగుతుందని చెప్పారు. అవసరమైతే ప్రాణత్యాగానికీ సిద్ధమని  మమతా ప్రకటించారు.  సోమవారం ధర్నా వేదిక వద్ద  క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏదో రకంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని చూస్తున్నారాని ఆరోపించారు. తాను చేస్తున్న నిరసనోద్యమం రాజకీయపరమైనది కాదని మమతా బెనర్జీ పేర్కొన్నారు
మరోవైపు, బెంగాల్ రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీ కార్యకర్తలు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. తృణమూల్ కార్యకర్తలు పలుచోట్ల ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా దిష్టిబొమ్మలను దహనం చేశారు. రైలు రోకో నిర్వహించి, రోడ్లపై బైఠాయించారు. మరోవైపు ఆదివారం రాత్రి నుంచి పశ్చిమబెంగాల్‌లో చోటుచేసుకున్న పరిణామాలపై  నివేదిక ఇవ్వాలని ఆ రాష్ట్ర గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠిని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆదేశించారు. హోంమంత్రి  ఆదేశాల మేరకు రాష్ట్ర గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి ఒక నివేదికను ఢిల్లీ పంపించారు.
ఈ వివాదానికి కేంద్రబిందువైన కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్‌కుమార్ చిట్‌ఫండ్ కేసులో ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉందంటూ  సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు  విచారించనున్నది. మరోవైపు బెంగాల్ ప్రభుత్వం కూడా సీబీఐకి వ్యతిరేకంగా కలకత్తా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ దానిపై అత్యవసరంగా విచారణ జరిపేందుకు ధర్మాసనం నిరాకరించింది.
మమతా దీక్షకు మద్దతు పలికేందుకు ఈరోజు మధ్యాహ్నం ఏపీ సీఎం చంద్రబాబు కోల్‌కతాకు వెళ్లనున్నారు. మరోవైపు చంద్రబాబు కోల్‌కతా వెళ్లే సమయానికి పలు జాతీయ పార్టీ నేతలు అక్కడకు వస్తున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆమె చేపట్టిన ‘సత్యాగ్రహ’ దీక్షకు సంఘీభావం తెలపనున్నారు.

Related posts