telugu navyamedia
రాజకీయ

టీచర్ రిక్రూట్‌మెంట్‌ స్కామ్‌లో బెంగాల్‌ మంత్రి పార్థ ఛటర్జీ అరెస్ట్‌..రూ. 20 కోట్లు స్వాధీనం

*మంత్రి అత్యంత సన్నిహితురాలు అర్పితా ఇంట్లో రూ.20 కోట్ల నగదు
*అన్ని అధారాల‌తో అరెస్ట్ చేశామంటూ ఈడీ అధికారులు
* స్కూల్ సర్వీస్ కమిషన్ రిక్రూట్‌మెంట్ లో భారీ స్కామ్‌

పశ్చిమ బెంగాల్ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పార్థ చటర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈరోజు అరెస్ట్ చేసింది. రాష్ట్రంలో జరిగిన ఉపాధ్యాయ నియామకాల కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలపై అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 26 గంటలపాటు విచారణ అనంతరం ఈడీ అధికారులు పార్థ ఛటర్జీని అరెస్ట్ చేశారు.

అనంతరం ఈడీ కార్యాలయానికి తరలించారు. స్కూల్ సర్వీస్ కమిషన్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌ విచారణను ఈడీ ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా శుక్రవారం ఉదయం నుంచి పలువురి ఇళ్లలో తనిఖీలు చేపట్టింది. మాజీ విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ అత్యంత సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఇంటిపై దాడులు చేసింది. ఈ తనిఖీల్లో ఏకంగా రూ.20 కోట్ల నగదు పట్టుబడినట్లు ఈడీ అధికారులు స్వాధీనం చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.

రాష్ట్రంలోని స్కూల్ సర్వీస్ కమిషన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ బోర్డ్ రిక్రూట్మెంట్ స్కామ్‌ విచారణలో కీలక పత్రాలను సైతం స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. 20కి పైగా మొబైల్ ఫోన్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఛటర్జీతో పాటు విద్యాశాఖ సహాయ మంత్రి పరేష్‌ సి అధికారి, ఎమ్మెల్యే మాణిక్‌ భట్టాచార్య తదితరుల నివాసాలపై కూడా ఈడీ దాడులు చేసింది.

స్కామ్‌తో సంబంధం ఉన్న వ్యక్తుల ఇళ్ల నుంచి కీలక పత్రాలు, అనుమానాస్పద కంపెనీల సమాచారం, ఎలక్ట్రానిక్ పరికరాలు, విదేశీ కరెన్సీ, బంగారం కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

కాగా..పరిశ్రమలు, వాణిజ్య శాఖలతో పాటు పార్థా ఛటర్జీ.. టీఎంసీ సెక్రెటరీ జనరల్‌గానూ వ్యవహరిస్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన టీచర్ రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ రిక్రూట్‌మెంట్‌లో గ్రూప్ సి, గ్రూప్ డి సిబ్బంది, 11, 12 తరగతుల సహాయక ఉపాధ్యాయులు, ప్రాథమిక ఉపాధ్యాయుల నియామకం చేపట్టారు. అయితే ఈ రిక్రూట్‌మెంట్‌లో స్కామ్ జరిగినట్టుగా వచ్చిన ఆరోపణలపై కోల్‌కత్తా హైకోర్టు ఆదేశాల మేరకు దాఖలు చేసిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. దీని ఆధారంగా ఈడీ అధారంగా ఈడీ మనీ లాండరింగ్ కోణంలో విచారణ కొనసాగిస్తుంది.

 

 

Related posts