telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

చర్చలకు స్పాట్ మమత ఇష్టం.. డాక్టర్ల యూనియన్

west bengal doctors on meeting with mamata

వెస్ట్ బెంగాల్‌ లో 6 రోజులుగా ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు,ప్రభుత్వ డాక్టర్లు సీఎం మమతా బెనర్జీతో చర్చల విషయంలో ఆదివారం కాస్త మెత్తబడ్డారు. చర్చలు ఎక్కడ నిర్వహించాలన్న విషయమై తుది నిర్ణయాన్ని మమతకే వదిలిపెట్టినట్లు డాక్టర్లు తెలిపారు. అయితే ఈ చర్చావేదిక మీడియా సమక్షంలో బహిరంగంగా ఉండాలనీ, గదిలో ఉండకూడదని షరతు విధించారు. కోల్‌ కతాలో ఆదివారం రెండున్నర గంటలపాటు సమావేశమైన డాక్టర్ల గవర్నింగ్‌ బాడీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ ఆందోళనను వీలైనంత త్వరగా ముగించాలని తామంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నామని డాక్టర్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని మెడికల్‌ కాలేజీలు, హాస్పిటల్ ప్రతినిధులతో చర్చించేందుకు వీలుగా సీఎం మమత చర్చావేదికను ఏర్పాటు చేయాలని సూచించారు.

ఆందోళన చేస్తున్న డాక్టర్లతో సోమవారం సమావేశమయ్యేందుకు సీఎం అంగీకరించారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సచివాలయం పక్కనే ఉన్న ఆడిటోరియంలో ఈ కార్యక్రమం ఉంటుందని,ఒక్కో ఆసుపత్రి నుంచి ఇద్దరు ప్రతినిధుల చొప్పున ఈ కార్యక్రమానికి ఆహ్వా నించినట్లు తెలిపారు. ఈ చర్చకు మీడియాను ఆహ్వానించాలన్న డాక్టర్ల ప్రతిపాదనపై మమత సుముఖంగా లేరన్నారు. గత సోమవారం ఎన్‌ఆర్‌ఎస్‌ మెడికల్‌ కాలేజీలో ఓ రోగి చనిపోవడంతో అతని బంధువులు ఇద్దరు డాక్టర్లపై దాడి చేసిన విషయం తెలిసిందే.ఈ దాడి ఘటనను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న డాక్టర్లకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది.మరోవైపు సీఎం మమత కూడా డాక్టర్ల డిమాండ్లకు అంగీకరిస్తున్నామని,వెంటనే డాక్టర్లు తిరిగి విధుల్లో చేరాలని విజ్ణప్తి చేశారు.

Related posts