telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు .. 33 గేట్లు ఎత్తివేత..

water released from tungabdra 33 gates

తుంగభద్ర జలాశయానికి ఎగువ నుంచి 2,12,720 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి చేరుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు జలాశయానికి ఉన్న 33 క్రష్‌ గేట్లను ఎత్తి 2,29,904 క్యూసెక్కుల నీటిని దిగువ నదిలోకి వదులుతున్నారు. వీటిలో జలాశయం అనుబంధ కాలువలకు 4,280 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా, క్రష్‌ గేట్ల ద్వారా నదికి 2,25,274 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. ఎగువనున్న తుంగ జలాశయం నుంచి విడుదలవుతున్న నీటితో పాటు సింగటలూరు వద్ద నుంచి కూడా అదనంగా నీరు వచ్చి చేరుతోంది. ముఖ్యంగా సింగటలూరు నుంచే రెండు లక్షల క్యూసెక్కులకు పైగా నీరు విడుదలవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో దిగువన ఉన్న నదీ ప్రాంతంలో మూడు లక్షల క్యూసెక్కుల దాకా నీరు విడుదల చేసే అవకాశాలున్నాయని బోర్డు వర్గాలు హెచ్చరిక జారీ చేశారు.

ఇప్పటికే దిగువనున్న హంపిలో వరదనీరు ముంచెత్తుతోంది. కాకపోతే జలాశయానికి అనుబంధంగా ఉన్న ఎల్‌బీఎంసీ కాలువతో పాటు హెచ్చెల్సీ కాలువకు పైపింగ్‌లు, గండ్లు పడటంతో నీటిని పూర్తిగా ఆయా కాలువలకు తగ్గించేశారు. హెచ్చెల్సీకి కేవలం కర్ణాటక వాటా మాత్రమే వదులుతున్నారు. ఆంధ్ర వాటా నీటిని పూర్తిగా తగ్గించినట్లు బోర్డు అధికారులు తెలిపారు. అదేవిధంగా తుంగభద్ర జలాశయానికి వరదనీరు పోటెత్తుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తమై నీటి లభ్యత పట్ల అంచనాలు వేస్తున్నారు. బోర్డు పరిధిలో పనిచేసే సిబ్బందిని అప్రమత్తంగా ఉంచి సెలవులు ఇవ్వకుండా ఆయా కాలువలపై ప్రత్యేక పహారా నిర్వహిస్తున్నారని బోర్డు కార్యదర్శి నాగమోహన్‌, ఎస్‌ఈ వెంకటరమణ తెలిపారు. జలాశయానికి గతేడాది 2.10 లక్షల క్యూసెక్కుల నీరు రాగా, ఈ యేడాది దానికి మించి నీరు వస్తున్నాయని వారు స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు బోర్డు అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను దిగువ ప్రాంతాలకు జారీ చేసినట్లు తెలిపారు. నదీ పరివాహక ప్రాంతాల గ్రామాలలో అప్రమత్తం చేసి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు తెలిపారు.

Related posts