telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

కేరళలోని స్కూళ్ళలో “వాటర్ బెల్” పద్ధతి… ఎందుకంటే ?

కేరళలోని స్కూళ్ళలో ఇప్పుడు కొత్త పద్ధతిని అనుసరిస్తున్నారు నిర్వాహకులు. విద్యాలయాల్లో రోజుకు మూడుసార్లు “వాటర్ బెల్”ను మోగిస్తున్నారు. పిల్లలు సరిగ్గా వాటర్ తాగుతున్నారో లేదో గమనిస్తున్నారు. ఎందుకంటే విద్యార్థులు నీటిని సరిగ్గా తాగకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను దూరం చేయడానికే కేరళ స్కూళ్ళలో ఈ కొత్త పద్ధతిని పాటిస్తున్నారు. కేరళలో అనుసరిస్తున్న ఈ “వాటర్ బెల్” పద్ధతితో ఒక్కసారిగా దేశం మొత్తం కేరళ వైపు చూస్తోంది. ఈ పద్ధతిని దేశంలోని అన్ని స్కూళ్లలో ప్రవేశపెడితే బాగుంటుందని చాలామంది ఆరోగ్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు, టీనేజర్స్ ప్రతిరోజూ 1.5 నుంచి 3 లీటర్ల నీటిని తాగాలి. నీరు తక్కువగా తాగే పిల్లల్లో డీహైడ్రేషన్ వల్ల తలనొప్పి, చిరాకు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి పిల్లలు ఫిజికల్ గానూ, ఏదైనా నేర్చుకోవడంలోనూ అంత చురుగ్గా ఉండలేరు. అయితే పాఠశాలల్లో తాగునీరు మాత్రమే అందిస్తే సరిపోదు. పాఠశాలల్లో శుభ్రమైన మరియు తగినంత మరుగుదొడ్డి సౌకర్యాలు లేకపోవడం వల్ల పిల్లలు, ముఖ్యంగా బాలికలు తాగునీటికి దూరంగా ఉంటారని పిల్లల వైద్యులు (పీడియాట్రిక్) చెబుతున్నారు. పర్యవసానంగా డి హైడ్రేషన్, మూత్రకోశ సంబంధిత వ్యాధుల బారిన పడతారు పిల్లలు. సాధారణంగా ఓ పీడియాట్రిక్ వైద్యుడి దగ్గరకు ప్రతిరోజూ కనీసం ఒక్క స్కూల్ విద్యార్థి అయినా యూరినరీ ఇన్ఫెక్షన్ సమస్యతో వస్తాడు.

water-bell

ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (IAP) మాజీ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ సచిదానంద కామత్ మాట్లాడుతూ “యూరినరీ ఇన్ఫెక్షన్ తో హాస్పిటల్ కు వచ్చే పిల్లల్లో ఎక్కువ మంది బాలికలే. స్కూల్ లో తగినంత నీరు తాగుతారా ? అని మేము వారిని అడిగినప్పుడు, వారు తగట్లేదనే సమాధానం ఇస్తారు. వారు పాఠశాలకు వాటర్ బాటిల్ తీసుకువెళుతున్నప్పటికీ, వారు పాఠశాలలో టాయిలెట్ కు వెళ్లకుండా ఉండాలని కోరుకుంటున్నందున వారు నీరు తాగరు” అని అన్నారు. నీటిని తాగని పిల్లలు నీటిని తాగే పిల్లలతో పోలిస్తే దాదాపు రెండు రెట్లు ఎక్కువ కేలరీలను తీసుకుంటారని అంతర్జాతీయ అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే వారు తమ రోజువారీ కేలరీలలో 10% కంటే ఎక్కువ చక్కెర పానీయాల నుండి తీసుకుంటారు. తద్వారా అధిక బరువు లేదా ఊబకాయం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఈ విషయంపై డాక్టర్ నారాయణన్ మాట్లాడుతూ “పాఠశాలల్లో స్వచ్ఛమైన తాగునీరు లేకపోవడం, తగినంత మరియు శుభ్రమైన మరుగుదొడ్లు లేకపోవడం సమస్య. ఎవరూ, ముఖ్యంగా బాలికలు, నీరు త్రాగడానికి ఇష్టపడరు, ఆపై విరామం ద్వారా సుదీర్ఘ క్యూలో నిలబడతారు” అని అన్నారు.

Related posts